సిరీస్ చేజార్చుకున్న టీమిండియా..

సిరీస్ చేజార్చుకున్న టీమిండియా..

Cricket: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా సిరీస్‌ను దక్కించుకునే అవకాశం కోల్పోయింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేను గెలిచిన ఆసీస్‌.. రెండో వన్డేలో కూడా విజయం సాధించింది. 51 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా.. మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. వార్నర్‌ (83), ఫించ్‌ (60‌), స్టీవ్‌ స్మిత్‌ (104; 64 బంతుల్లో), లబూషేన్‌(70), మ్యాక్స్‌వెల్‌ (63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4సిక్సర్లు)లు రాణించడంతో ఆసీస్ స్కోరు పరుగులు పెట్టింది. వార్నర్‌-ఫించ్‌ల జోడి తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఆసీస్‌కు తిరుగులేకుండా పోయింది.



అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా చివరి వరకూ పోరాడిని భారీ లక్ష్యం చేధించలేకపోయింది. టీమిండియా ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (30), మయాంక్‌ అగర్వాల్‌(28)లు 9 ఓవర్లలోపే ఔటయ్యారు. కోహ్లి (89), శ్రేయాస్‌ అయ్యర్‌ (38)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ జోడి మూడో వికెట్‌కు 93 పరుగులు జత చేశాక అయ్యర్‌ పెవిలియన్‌ చేరాడు.

ఆ తర్వాత వచ్చిన రాహుల్‌తో కలిసి కోహ్లి ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. ప్రధానంగా రాహుల్‌ ఫోర్లు, సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు. ఈ జంటకు బ్రేక్ వేస్తూ.. హజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో హెన్రిక్యూస్‌ ఒక మెరుపు క్యాచ్‌ అందుకోవడంతో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు కోహ్లి. హార్దిక్‌ పాండ్యాతో కలిసి ఆడిన రాహుల్‌ 63 పరుగులు జత చేశారు. రాహుల్‌(76) ఐదో వికెట్‌గా ఔటయ్యాక టీమిండియా స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
జడేజా(24), హార్దిక్‌ పాండ్యా(28)లు మోస్తరుగా ఆడటంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 9 వికెట్ల నష్టానికి 338 పరుగులు మాత్రమే చేసి ఓటమికి గురైంది.