కోచ్ రాజీనామా: భారత్‌తో మ్యాచ్‌లే కారణమా?

కోచ్ రాజీనామా: భారత్‌తో మ్యాచ్‌లే కారణమా?

సొంతగడ్డపైనే కాదు విదేశాల్లోనూ ప్రభంజనం సృష్టించగలమని చెప్పి మరీ సిరీస్‌లను కైవసం చేసుకుంటుంది టీమిండియా. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకముందు టెస్టు సిరీస్ విజయమనేది ఓ కల. అలాంటిది టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను విజయంతో ముగించిన భారత్.. సగర్వంగా న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టి ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసేసుకుంది. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో రెచ్చిపోయి ఆడిన భారత బ్యాట్స్‌మెన్ సిడ్నీ వేదికగా జరిగిన తొలి టెస్టులో 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆ కోచ్ రాజీనామాకు కారణమవుతుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. 

 

కానీ, తొలి టెస్టు మొదటి రోజు భారత్ 303-4 పరుగులతో నిలిచింది.  దాంతో ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌కు ఆసీస్ బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్‌కు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సంబంధాలు చెడిపోవడంతో ఆస్ట్రేలియా జట్టుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. డేవిడ్ సాకర్ మూడు సీజన్లుగా ఆస్ట్రేలియా జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. ఈ సందర్భంగా డేవిడ్ సాకర్ మాట్లాడుతూ ‘నేను ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు సేవలందించే క్రమంలో చాలా ఎంజాయ్‌ చేశా. మేటి బౌలర్లు ఉన్న జట్టుతో కలిసి పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంద’ని సాకర్‌ తెలిపాడు. 

 

‘తొమ్మిది నెలల నుంచి డేవిడ్‌ సాకర్‌తో కలిసి పని చేస్తున్నా. డేవిడ్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జట్టులో చెరగని ముద్ర వేసిన సాకర్‌కు ధన్యవాదాలు. ఆసీస్‌ పేస్‌ బౌలింగ్‌ను మరింత పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించాడు’ అని లాంగర్ అన్నాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో డేవిడ్‌ సాకర్‌ తీసుకున్న నిర్ణయం క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)ను గందరగోళంలో పడేసింది. బౌలింగ్ కోచ్ స్థానంలో తాత్కాలికంగా ఎంపిక చేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.