పరుగుల ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు.. కష్టాల్లో ఇంగ్లాండ్!

పరుగుల ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు.. కష్టాల్లో ఇంగ్లాండ్!

పింక్‌ బాల్‌ టెస్ట్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఇంగ్లాండ్ నడ్డి విరవగా.. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన భారత బ్యాట్స్‌మెన్లు కూడా చతికిలపడ్డారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ అద్భుతమైన మలుపు తిరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 145 పరుగులకే ఆలౌట్ చేసి ఇంగ్లాండ్ అద్భుతంగా తిరిగి గెలుపు అవకాశాలు నిలుపుకుంది.

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌట్‌ అవగా.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ 5 వికెట్లు తీసి భారత జట్టును ఆలౌట్ చెయ్యడంలో కీలక పాత్ర పోషించగా.. టీమిండియా చివరి వికెట్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల స్వల్ప ఆధిక్యంలో మాత్రమే నిలిచింది. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ లీచ్‌ టీమిండియాను దెబ్బ కొట్టాడు. కీలక ఆటగాళ్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, పుజారా వికెట్లు తీసిన లీచ్‌ రహానే (7)ను, ఆ వెంటనే మెరుగ్గా రాణిస్తున్న రోహిత్‌ శర్మ (66)ను అవుట్ చేసి పెవిలియన్‌కు పంపాడు.

అంతుకుముందు మొదటి రోజు అక్షర్ పటేల్ చేసిన అద్భుతమైన బౌలింగ్ ముందు, ఇంగ్లీష్ జట్టు కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది.. తొలి రోజు ఆట ముగిసే వరకు 3 వికెట్ల నష్టంతో భారత్ 99 పరుగులు చేసింది. రెండవ రోజు, మొదటి సెషన్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 145 పరుగులకు కట్టడి చేసింది ఇంగ్లాండ్ జట్టు. తొలి ఇన్నింగ్స్‌ ఆధారంగా భారత్‌ ఇంగ్లండ్‌పై 33 పరుగుల ఆధిక్యంలో ఉంది.

మ్యాచ్ మొదటి రోజు, టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోగా.. భారత్ తరఫున 100 వ టెస్ట్ మ్యాచ్ ఆడిన ఇషాంత్ తొలి వికెట్ సాధించాడు. దీని తరువాత అక్షర్ పటేల్, అశ్విన్ కలిసి 9 వికెట్లు తీశారు. తన రెండవ టెస్ట్ ఆడుతున్న అక్షర్ మొదటి ఇన్నింగ్స్‌లో 38 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో అశ్విన్ 26 పరుగులు ఇచ్చి 3వికెట్లు సాధించాడు.

రెండో రోజు భారత్‌ ఓపెనర్‌ షుబ్‌మన్‌ గిల్‌ వికెట్‌ను 33 పరుగుల వద్ద కోల్పోయింది. అతను 11 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తర్వాత చేతేశ్వర్ పుజారా ఖాతా తెరవకుండా జాక్ లీచ్ బౌలింగ్‌లో Lbw అయ్యాడు. 27 పరుగులతో బ్యాటింగ్ చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా లీచ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె జాక్ లీచ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

తర్వాత రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్.. ఫస్ట్ ఓవర్.. ఫస్ట్ బాల్‌కే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జాక్ క్రాలీ అవుట్ అయ్యాడు. ఫస్ట్ ఓవర్ మూడవ బంతికే అక్షర్ చేతిలో బెయిర్ స్టో వికెట్ కోల్పోయింది. పరుగులేమీ లేకుండానే ఇంగ్లాండ్ రెండు వికెట్లను కోల్పోయింది.