ధోనీ రిటైర్మెంట్ ప్రచారంపై బీసీసీఐ క్లారిటీ: మిస్టర్ కూల్ ప్రెస్ మీట్

  • Published By: vamsi ,Published On : September 12, 2019 / 12:30 PM IST
ధోనీ రిటైర్మెంట్ ప్రచారంపై బీసీసీఐ క్లారిటీ: మిస్టర్ కూల్ ప్రెస్ మీట్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోరీ రిటైర్ అవుతారనే వార్తలు వస్తున్న క్రమంలో ఈ రోజు రాత్రి 7గంటలకు తన రిటైర్మెంట్‌ను ప్రకటించేందుకు ధోనీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే ధోనీ రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ స్పందించింది. ధోనీ రిటైర్మెంట్‌కి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు.

‘ధోనీ రిటైర్మెంట్‌కి సంబంధించి తమ దగ్గర ఎటువంటి సమాచారం లేదని, ధోనీ రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలు అవాస్తవం.’ అని ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాకు తెలిపారు. వరల్డ్ కప్ ‌ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకుని ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో జమ్మూకాశ్మీర్‌లో కూడా కొన్ని రోజులు విధులు నిర్వర్తించాడు. తర్వాత దక్షిణాఫ్రికా టూరుకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో ధోనీకి చోటు దక్కలేదు. ఈ క్రమంలో ధోనీ రిటైర్మెంట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగింది.

అయితే, మిస్టర్ కూల్ మాత్రం ఎక్కడా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఇవాళ(12 సెప్టెంబర్ 2019) సాయంత్రం 7 గంటలకు ధోని ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. అది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేందుకేనని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. త్వరలోనే ఝార్ఖండ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి బీజేపీ తరపున అయన పోటీ చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధోనీ ప్రెస్ మీట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.