ఖేల్ రత్న అవార్డుకు రోహిత్ శర్మను నామినేట్ చేసిన BCCI

  • Published By: venkaiahnaidu ,Published On : May 30, 2020 / 03:24 PM IST
ఖేల్ రత్న అవార్డుకు రోహిత్ శర్మను నామినేట్ చేసిన BCCI

ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020 కు టీమిండియా వ‌న్డే టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను నామినేట్ చేసిన‌ట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) శనివారం ప్రకటించింది. ఇక, ఇశాంత్ శర్మ, శిఖర్ ధావన్, మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మలను అర్జున అవార్డుకు నామినేట్ చేసినట్లు తెలిపింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ 2016 జనవరి 1 నుండి 2019 డిసెంబర్ 31 వరకు పరిశీలన కాలంతో సంబంధిత అవార్డులకు ఆహ్వానాలను కోరిన విషయం తెలిసిందే.

రోహిత్ శర్మ 2019 వన్డే ప్రపంచ కప్‌లో భారత స్టార్‌ పెర్ఫార్మర్‌గా నిలిచాడు. అతని అద్భుతమైన ప్రదర్శన కార‌ణంగా ఐసిసి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 2017 ఆరంభం నుంచి వన్డేల్లో​ 18 శతకాలు నమోదు చేయగా, మొత్తం 28 శతకాలతో వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో మూడు ద్విశతాకాలు చేసిన ఏకైక క్రికెటర్‌గానూ రికార్డు హిట్‌మ్యాన్‌ పేరిటే ఉంది.

మరోవైపు అర్జున అవార్డుకు నామినేట్‌ అయిన శిఖర్‌ ధావన్‌ సైతం కొన్నేండ్లుగా నిలకైడన ప్రదర్శన చేస్తున్నాడు. టెస్టుల్లో పేసర్‌ ఇషాంత్‌ శర్మ విజృంభిస్తూ.. ఎంతో కాలంగా జట్టుకు సేవలందిస్తున్నాడు. మరోవైపు భారత మహిళల జట్టు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మూడేండ్లుగా బ్యాట్‌తో, బంతితో రాణిస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నది. వన్డే, టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లోనూ అద్భుత ప్రదర్శన కబరుస్తుంది.