Ben Stokes: క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్ అరుదైన రికార్డు.. బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ చేయకుండా
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో ఐర్లాండ్(Ireland)తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.

Ben Stokes
England Test Captain Ben Stokes: ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) చరిత్ర సృష్టించాడు. బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ చేయకుండా టెస్టుల్లో మ్యాచ్ గెలిచిన తొలి కెప్టెన్‌గా ఘనత సాధించాడు. స్వదేశంలో ఐర్లాండ్(Ireland)తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన ఇంగ్లాండ్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ ఓలీపోప్ (205; 208 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్సర్లు) ద్విశతకంతో చెలరేగగా, బెన్ డకెట్(182; 178 బంతుల్లో 24 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకం చేయడంతో పాటు జో రూట్(56; 59 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించడంతో 524/4 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
352 లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఐర్లాండ్ ఓ పట్టాన లొంగలేదు. ఐరీష్ బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లను సతాయించారు. ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 362 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు 11 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఇంగ్లాండ్ జట్టు నాలుగు బంతుల్లోనే ఈ లక్ష్యాన్ని ఛేదించింది.
ఫీల్డింగ్ మినహా..
ఇక ఈమ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ ఫీల్డింగ్ మినహా మరేమీ చేయలేదు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. టాప్-4 బ్యాటర్లు చెలరేగడంతో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మోకాలి గాయంతో బాధపడుతున్న స్టోక్స్ ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోవడం లేదు. యాషెస్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని అతడు కనీసం బౌలింగ్ కూడా చేయలేదు. ఇలా టెస్టు క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ చేయకుండా మ్యాచ్ గెలిచిన తొలి కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్ రికార్డు సృష్టించాడు.