విశాల హృదయం: మాజీ క్రికెటర్‌ చికిత్సకు కృనాల్ పాండ్యా బ్లాంక్ చెక్

విశాల హృదయం: మాజీ క్రికెటర్‌ చికిత్సకు కృనాల్ పాండ్యా బ్లాంక్ చెక్

ప్రాణాలు నిలుపుకునేందుకు వెంటిలేటర్‌పై పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ జకోబ్ మార్టిన్‌ను ఆదుకునేందుకు క్రికెట్ ప్రపంచం కదిలొచ్చింది. డిసెంబరు 28వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మార్టిన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతని ఊపిరితిత్తులు, కాలేయం పూర్తిగా దెబ్బతిన్నాయి. చికిత్స చేయించేందుకు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో బీసీసీఐని సంప్రదించారు. వారి అభ్యర్థనకు స్పందించిన బీసీసీఐ రూ.5లక్షలు అందజేసింది. బరోడా క్రికెట్ అసోసియేషన్ కూడా ముందుకొచ్చి రూ.3లక్షల సాయం చేసింది. 

విషయం తెలుసుకున్న సౌరవ్ గంగూలీ సైతం అతని వంతు సాయం అందించారు. జకోబ్ కుటుంబానికి సాయమందించేందుకు అందరికంటే ముందు బరోడా క్రికెట్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ సంజయ్ పటేల్ స్పందించారు. మార్టిన్ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్‌లు కదిలొచ్చారు. 

వారితో పాటుగా హార్దిక్ పాండ్యా సోదరుడైన కృనాల్ పాండ్యా చేయి కలిపాడు. తన వంతుగా సాయం చేస్తూ ఆ కుటుంబానికి బ్లాంక్ చెక్ అందించాడు. కనీసం రూ.లక్షకు తక్కువ కాకుండా తీసుకోవాలని కోరాడు. ‘సర్, మీకెంత కావాలో అంత తీసుకోండి. కానీ రూ లక్షకు తక్కువ కాకుండా చూడండి’ అని ఓ సందేశాన్ని జతపరిచాడు. గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మార్టిన్ వన్డే జట్టులో 1999 సెప్టెంబర్‌లో అరంగ్రేటం చేశాడు. ఐదు మ్యాచ్‌లలో 158పరుగులు చేయగలిగాడు.