క్రికెట్ లో ‘కులం’ : బ్రాహ్మిణ్ క్రికెట్ టోర్నమెంట్, ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే

క్రికెట్ లో ‘కులం’ : బ్రాహ్మిణ్ క్రికెట్ టోర్నమెంట్, ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే

Brahmin only’ cricket tournament in Hyderabad : క్రికెట్ కు కులం, మతం అనే బేధాలు ఉండవు. అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకు చెందిన వారు ఆడుతుంటారు. భారతీయ సమాజంలో కుల అసమానతలు అధికంగా ఉంటాయి. కానీ..క్రికెట్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ‘బ్రాహ్మిణి క్రికెట్ టోర్న మెంట్ (Brahmin Cricekt Tournament) సంబంధించిన పోస్టు ఒకటి వైరల్ గా మారింది. హైదరాబాద్ నాగోల్ లో ఉన్న బీఎస్ఆర్ క్రికెట్ మైదానం (BSR Cricket Grounds)లో డిసెంబర్ 25, 26వ తేదీల్లో ఈ టోర్నీ జరగబోతోందని పోస్టులో వెల్లడించారు.

ఇప్పటికే టోర్నీముగిసిపోయింది కూడా. కానీ..ఈ టోర్నీలో పాల్గొనాలంటే..కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలని నిబంధన ఉండడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రతి క్రీడాకారుడు తప్పనిసరిగా వారి ఐడీ తీసుకరావాలని సూచించింది. స్థానికంగా ఉన్న సంస్థల అనుమతితో ఈ టోర్నమెంట్ జరిగిందని, ఈ కార్యక్రమానికి వచ్చిన ఆదాయం స్థానిక ప్రైవేటు ఎన్జీవోకు వెళ్లిందని టోర్నమెంట్ నిర్వాహకులు వెల్లడించారు. హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మొత్తం 24 టీమ్స్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్, మరుసటి రోజు నాగోల్ లో ఈ టోర్నమెంట్ నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఎంట్రీ ఫీజు రూ. 3500 గా నిర్ధారించారు. టోర్న మెంట్ లో గెలిచిన జట్టుకు రూ. 15 వేలు, రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ. 10 వేల ఫ్రైజ్ మనీ ప్రకటించారు. పది ఓవర్ల మ్యాచ్ ఉంటుందని, ఫీజును గూగుల్ పే ద్వారా పంపించవచ్చని పోస్టర్ లో ప్రచురించారు. క్రీడాకారులకు లంచ్ సౌకర్యం ఉంటుందని, మొదట వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. క్రికెట్ ఆడేందుకు కులం పట్టింపు ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు.