చెపాక్‌ టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ జోరు

చెపాక్‌ టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ జోరు

Chennai Test: : చెపాక్‌ టెస్ట్‌లో ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్‌ రెచ్చిపోయారు.. టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ.. పరుగుల వరద పారించారు.. ఇక చెపాక్‌ వేదికగా.. జో రూట్‌.. తన రికార్డులకు రూట్ వేసుకున్నాడు.. తొలి రోజు సీనే.. రెండో రోజూ రిపీట్ అయ్యింది.. ఇంగ్లాండ్ సారథి జో రూట్‌ సెంచరీని డబుల్ సెంచరీగా మలుచుకోగా.. బెన్‌ స్టోక్స్‌ 82 పరుగులతో అదరగొట్టాడు.. అయితే ఆఖరి సెషన్‌లో భారత బౌలర్లు పుంజుకున్నా అంతిమంగా రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ పైచేయి సాధించింది.

3 వికెట్ల నష్టానికి 263 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌.. ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్ల నష్టానికి 555 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెస్‌, లీచ్‌ ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌, నదీమ్‌, ఇషాంత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ఇంకా డిక్లేర్‌ చేయలేదు. రెండో రోజు ఆటను ప్రారంభించిన రూట్‌, స్టోక్స్‌ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. రూట్‌ జిడ్డుగా బ్యాటింగ్‌ చేయగా.. స్టోక్స్‌ కాస్త దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు.. తొలి సెషన్‌లో ఒక్క వికెట్‌ నష్టపోకుండా 355 పరుగులు చేసింది ఇంగ్లీష్‌ టీమ్‌. ఆ తర్వాత ఫ్లిక్‌ షాట్లు, డ్రైవ్‌లు, స్వీప్‌షాట్లతో పరుగులు చేశాడు రూట్‌… అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో డబుల్ సెంచరీ చేశాడు.. రూట్‌ కేరీర్‌లో ఇది ఐదో సెంచరీ కాగా.. గత మూడు టెస్టుల్లో రెండో డబుల్ సెంచరీ.

ఇక చివరి సెషన్‌లో మాత్రం టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. పోప్‌ను అశ్విన్ ఔట్ చేయగా, తర్వాతి ఓవర్‌లోనే రూట్‌ను నదీమ్ బోల్తాకొట్టించాడు. ఇషాంత్‌ శర్మ వరుస బంతుల్లో బట్లర్‌, ఆర్చర్‌ ను ఔట్ చేశాడు. భారత బౌలర్ల జోరు చూస్తే ఇంగ్లాండ్ ఆలౌట్‌ అవుతుందని భావించారంతా. కానీ బెస్‌, లీచ్ ఆచితూచి ఆడటంతో క్రీజులో నిలిచారు. మొత్తం మీద చెపాక్‌ టెస్టు తొలి, రెండు రోజుల్లో ఇంగ్లాండ్‌దే పైచేయి కాగా.. మిగిలిన మూడ్రోజులు మ్యాచ్‌ ఎలాంటి మలుపులు తిరుగనుందో చూడాలి.