Punia And Sakshi Malik Wins Gold : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జోరు.. ఒకేరోజు రెండు గోల్డ్ మెడల్స్.. పునియా, సాక్షి మాలిక్‌కు స్వర్ణం
ఇంగ్లండ్ బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రెజ్లర్లు అదరగొడుతున్నారు. ఒక్కరోజే రెండు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు.

Punia And Sakshi Malik Wins Gold : ఇంగ్లండ్ బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రెజ్లర్లు అదరగొడుతున్నారు. ఒక్కరోజే రెండు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ కామన్వెల్త్ పోటీల్లో స్వర్ణం సాధించింది. 62 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కెనడాకు చెందిన అనా గొడినెజ్‌పై సాక్షి మాలిక్ విజయం సాధించింది.
ఈ పతకంతో కలిపి ఈ పోటీల్లో భారత్ 8 స్వర్ణాలు సాధించింది. సాక్షి మాలిక్ గెలవడానికి ముందే రెజ్లింగ్‌లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కెనడాకు చెందిన మెక్‌నెల్‌ను ఓడించి భారత్‌కు స్వర్ణాన్ని అందించాడు. 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో అన్షుమాలిక్ రజతం తెచ్చింది.
మరోవైపు భజరంగ్ పూనియా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కామెన్ వెల్త్ గేమ్స్ లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన అతడు.. మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు.
పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగంలో తలపడిన పూనియా.. కెనడాకు చెందిన లాచలాన్ మెక్‌నీల్‌ను 2-9 పాయింట్ల తేడాతో ఓడించి బంగారు పతకం సాధించాడు. 2014 కామన్‌వెల్త్ క్రీడల్లో సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్న ఈ 28 ఏళ్ల స్టార్ రెజ్లర్.. 2018లో వేల్స్‌కు చెందిన కేన్ చారిగ్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు. ఈసారి మళ్లీ తన మ్యాజిక్ రిపీట్ చేసి స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు.