IPL 2023: వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఐపీఎల్ ట్రోపీకి సీఎస్‌కే యాజమాన్యం పూజలు.. ఫొటోలు వైరల్
ఐపీఎల్ ట్రోపీతో టీం యాజమాన్యం మంగళవారం అహ్మదాబాద్ స్టేడియం నుంచి చెన్నైకి చేరుకున్నారు.

Venkateswara Swamy Temple in Chennai city
Chennai Super Kings: ఐపీఎల్ 2023 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన విషయం విధితమే. ఆ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చివరి ఓవర్లో చివరి రెండు బంతులకు వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఐదోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. తద్వారా ముంబయి ఇండియన్స్ రికార్డును సమం చేసింది. టీం విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఆ జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోనిసైతం ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవటంతో ఎమోషనల్ అయ్యారు.

Chennai Venkateswara Swamy Temple
ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న మరుసటి రోజుకూడా సీఎస్‌కే టీం సభ్యుల వేడుకలు కొనసాగాయి. ఐపీఎల్ ట్రోపీతో టీం యాజమాన్యం మంగళవారం అహ్మదాబాద్ స్టేడియం నుంచి చెన్నైకి చేరుకున్నారు. సాయంత్రం చెన్నై నగరంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ట్రోపీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రధాన కార్యనిర్వహణాధికారి కేఎస్ విశ్వనాథన్‌తో సహా సీఎస్‌కే సభ్యులు ఎన్. శ్రీనివాసన్, చైర్మన్ ఆర్. శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ సభ్యులు స్వామివారి సన్నిదిలో ట్రోఫీతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Chennai Venkateswara Swamy Temple
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదో సారి ఐపీఎల్ ట్రోపీని దక్కించుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా మాజీ క్రీడాకారులు, క్రీడాకారులు, ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీని, జడేజా ఆట తీరును ప్రశంసిస్తూ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.