Dale Steyn: డేల్ స్టెయిన్ రిటైర్మెంట్.. మైలురాయికి అడుగు దూరంలో!

దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ మంగళవారం(31 ఆగస్ట్ 2021) అన్ని రకాల క్రికెట్ ఫార్మట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Dale Steyn: డేల్ స్టెయిన్ రిటైర్మెంట్.. మైలురాయికి అడుగు దూరంలో!

Dale Steyn

Dale Steyn: దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ మంగళవారం(31 ఆగస్ట్ 2021) అన్ని రకాల క్రికెట్ ఫార్మట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ట్వీట్టర్‌లో ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించాడు స్టెయిన్. ముఖ్యమైన మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా జట్టును విజయపథంలో నడిపించిన స్టెయిన్.. ప్రత్యేకమైన రికార్డులు సృష్టించారు. దక్షిణాఫ్రికా తరపున 93 టెస్టులు, 125 వన్డేలు మరియు 47 టీ20 లు ఆడిన స్టెయిన్.. టెస్టుల్లో 439 వికెట్లు తీశాడు. ఇందులో 26 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదేసి వికెట్లు, ఐదు సార్లు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టాడు.

అదే సమయంలో 125 వన్డేలు ఆడిన స్టెయిన్, 196 వికెట్లు పడగొట్టాడు. 47 టీ20 మ్యాచుల్లో 64 వికెట్లు తీశాడు. మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 699 వికెట్లు తీసిన డేల్ స్టెయిన్, 700 వికెట్ల క్లబ్‌లో చేరడానికి ఒక్క వికెట్ దూరంలో క్రికెట్‌రీ వీడ్కోలు పలికాడు. ఐపీఎల్​లో 95 మ్యాచులు ఆడిన స్టెయిన్ 6.91ఎకానమీతో 97 వికెట్లు పడగొట్టాడు.

స్టెయిన్ 2019 సంవత్సరంలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అప్పటి నుంచి పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడుతూ ముందుకు సాగుతున్నాడు. ఫిబ్రవరి 2020లో ఆస్ట్రేలియాతో తన కెరీర్‌లో చివరి టీ20 మ్యాచ్ ఆడిన స్టెయిన్.. నవంబర్ 2016 నుంచి భుజం గాయంతో బాధపడుతున్నాడు. రిటైర్మెంట్ ప్రకటనలో.. “ఈరోజు నేను నాకు చాలా ఇష్టమైన క్రీడ నుంచి అధికారికంగా రిటైర్ అయ్యాను. కుటుంబం నుంచి సహచరులు, జర్నలిస్టులు, అభిమానుల వరకు అందరికి ధన్యవాదాలు, నా ఈ ప్రయాణం చాలా అద్భుతమైనది.” అమెరికన్ రాక్ బ్యాండ్ ‘కౌంటింగ్ క్రో’ పాటను ప్రస్తావిస్తూ స్టెయిన్ తన పదవీ విరమణను ప్రకటించిన లేఖలో తన భావాలను వ్యక్తపరిచారు.

20 సంవత్సరాల శిక్షణ, మ్యాచ్‌లు, ప్రయాణాలు, విజయాలు, ఓటములు, అలసట, ఆనందం మరియు సోదరభావం. చెప్పడానికి మరపురాని క్షణాలు చాలా ఉన్నాయి. చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి. స్టెయిన్ పేరు మీద అనేక ICC అవార్డులు ఉన్నాయి. ప్రపంచ క్రికెట్‌లో బంతిని నిలకడగా 150 కిమీ వేగంతో విసిరే బౌలర్లలో డేల్ స్టెయిన్ ఒకరు. 38 ఏళ్ల స్టెయిన్ 20 సంవత్సరాల తన కెరీర్‌లో అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు. వేగవంతమైన, అద్భుతమైన స్వింగ్‌కు ప్రసిద్ధి చెందిన స్టెయిన్‌కు 2008లో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు(టెస్ట్) లభించింది.

ఇది కాకుండా, అతని పేరు మీద అనేక అవార్డులు కూడా ఉన్నాయి. 2013 సంవత్సరంలో, అతను విస్డెన్ లీడింగ్ క్రికెటర్ అవార్డును అందుకున్నాడు, 2011 మరియు 2014 సంవత్సరాలలో అతను ICC వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. ఇది కాకుండా, 201 లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అతని పేరిట ఉంది.