IPL – 2020, ఢిల్లీ వెళ్లింది ఫైనల్‌కు, సన్ రైజర్స్ పరాజయం

  • Published By: madhu ,Published On : November 9, 2020 / 06:36 AM IST
IPL – 2020, ఢిల్లీ వెళ్లింది ఫైనల్‌కు, సన్ రైజర్స్ పరాజయం

delhi capitals beat sunrisers hyderabad : ఐపీఎల్‌ -13 ఫైనల్‌కు ఢిల్లీ కేపిటల్స్‌ దూసుకెళ్లింది. ఐపీఎల్‌ ఫైనల్‌లో ఢిల్లీ తొలిసారి కాలుపెట్టింది. రాత్రి జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. దీంతో ఢిల్లీ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మంగళవారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ముంబైతో తలపడనుంది.



కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వార్నర్ సేన ఆకట్టుకోలేకపోయింది. కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. ఢిల్లీ విధించిన భారీ లక్ష్యాన్ని(20 ఓవర్లలో మూడు వికెట్లకు 189) చేధించలేక చతికిలబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేసింది. కేన్ విలియమ్సన్ పోరాడినా ఆఖరి వరకు ఉండకపోవడంతో జట్టును గెలిపించలేకపోయాడు. అతడు 45 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 16 బంతుల్లో 33 రన్స్ చేశాడు. మనీష్ పాండే 21 పరుగులు సాధించాడు. వార్నర్ రెండు పరుగులే చేసి పెవిలియన్‌ చేరాడు. ఇక ప్రియం గార్గ్ 17 రన్స్‌ చేయగా.. జేసన్ హోల్డర్ 11, రషీద్ ఖాన్ 11, గోస్వామి డకౌట్‌గా వెనుదిరిగాడు.



https://10tv.in/son-brutally-beaten-by-mother-she-involved-in-live-in-relationship-in-guntur-district/
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఆరంభంలోనే తడబడింది. రెండో ఓవర్‌లోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మనీశ్ పాండే ధాటిగా ఆడాడు. ఐదో ఓవర్లో గార్గ్‌తో పాటు ఊపు మీదున్న పాండే కూడా ఔట్ అయ్యాడు. హోల్డర్స్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు విలియమ్సన్. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 46 పరుగల భాగస్వామ్యం నెలకొల్పారు. 12 ఓవర్లో హోల్డర్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు.



అనంతరం క్రీజులోకి వచ్చిన సమద్..ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. విలియమ్సన్, సమద్ ఇద్దరూ ధాటిగా ఆడుతూ ఢిల్లీ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. 17వ ఓవర్లో స్టోయినిస్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. విలియమ్సన్‌ను ఔట్ చేయడంతో హైదరాబాద్ టీమ్ కష్టాల్లో పడింది. అనంతరం రషీద్, సమద్ కాసేపు మెరుపులు మెరిపించి.. సన్‌రైజర్స్‌ జట్టులో ఆశలు రేపారు. 19వ ఓవర్లో సమద్, రషీద్ ఖాన్, గోస్వామి మూడు వరుస బంతుల్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది.



ఢిల్లీ బౌలర్లలో కాగిసో రబడ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగు వికెట్లు 19వ ఓవర్‌లోనే పడగొట్టాడు. ఇక మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లు సాధించాడు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.



మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 50 బంతుల్లో 78 పరుగులతో రఫ్పాడించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌లో వచ్చిన స్టోయినిస్ దూకుడుగా ఆడి 38 రన్స్ సాధించాడు. హెట్‌మెయిర్ కూడా 42 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ 21 పరుగులతో పరవా లేదనిపించాడు. దీంతో ఢిల్లీ బారీ స్కోరు చేయగలిగింది.



ఈ సీజన్‌ లీగ్‌లో హైదరాబాద్‌, ఢిల్లీ తలపడిన రెండుసార్లు సన్‌రైజర్స్‌ విజయం సాధించింది. సెప్టెంబర్‌ 29న అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై హైదరాబాద్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక అక్టోబర్‌ 27న దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై 88 పరుగుల తేడాతో భారీ విజయాన్ని హైదరాబాద్‌ నమోదు చేసింది. అయితే కీలకమైన క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీ చేతిలో ఓడిపోయి.. ఇంటిబాట పట్టింది హైదరాబాద్‌.