మూడో వన్డే హీరోలు ఆ ముగ్గురే!!

మూడో వన్డే హీరోలు ఆ ముగ్గురే!!

ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. తొలి ఫార్మాట్ అయిన టీ20ను 1-1తో సమంగా ముగించిన ఇరు జట్లు.. రెండో ఫార్మాట్‌లో మాత్రం హోరాహోరీగా తలపడ్డాయి. స్లెడ్జింగ్‌లు పలు వివాదాలతో ముగిసిన టెస్టు సిరీస్‌లో భారత్ విజయం సాధించి టీమిండియా చరిత్ర సృష్టించింది. ఆఖరిదైన వన్డే ఫార్మాట్‌లో తొలి మ్యాచ్‌ను సిడ్నీ వేదికగా ఓడిపోయిన భారత్ పట్టుదలతో అడిలైడ్‌ వేదికగా తలపడి సత్తా చాటింది. అద్భుతమైన విజయాన్ని ఆరు వికెట్ల తేడాతో సాధించింది. ఇక చివరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేను బీభత్సమైన పోరుతో ముగించింది. 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ముందుగా బౌండరీలు దూరంగా ఉన్న మెల్‌బోర్న్ మైదానంలో బ్యాట్స్‌మెన్‌ను పరుగులు చేయకుండా కట్టడి చేసింది. ఆ తర్వాత సహనంతో ఆసీస్ బౌలర్లను ఎదుర్కొని మరో ఫార్మాట్లోనూ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇలా ఆసీస్ గడ్డపై టీమిండియా ద్వైపాక్షిక విజయం సాధించడం చరిత్రలోనే ఇది తొలిసారి. 

కాగా, నిర్ణయాత్మక వన్డేలో ముగ్గురి ప్రదర్శన ఆటకే హైలెట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో చాహల్ బౌలింగ్‌తో మెరిపించాడు. తొలి రెండు వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన కుల్దీప్ ఆకట్టుకోలేకపోయాడు. అతని స్థానంలో చాహల్‌కు చోటిస్తూ తుది జట్టులో స్థానం కల్పించాడు కోహ్లీ. కెప్టెన్ నిర్ణయం అద్భుతమైనదంటూ నిరూపించుకున్నాడు చాహల్. ఆరు వికెట్లు తీసి దిగ్గజాల సరసన చేరాడు. 

ఫామ్ కోల్పోయాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విరామం అనంతరం వన్డే జట్టులో స్థానం దక్కించుకుని పునర్వైభవాన్ని చూపించాడు. ఆడిన మూడు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించడమే కాక, జట్టుకు దన్నుగా నిలబడి రెండు, మూడు వన్డేలకు మంచి ఫినిషర్‌గా నిలిచాడు. 

ఓ పక్క అనుభవశాలి అయిన ధోనీ సహనంతో మైదానంలో స్థిరపడిపోతే అతనికి సహకారం అందిస్తూ కేదర్ జాదవ్ సైతం చక్కటి సమన్వయం పాటించాడు. ఒకానొక దశలో మ్యాచ్‌పై వదిలేసుకున్నా.. 18 పరుగులకు 27పరుగులు చేసేంత దగ్గరగా లక్ష్యానికి చేరువయ్యారు. అటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా సహనంగా కనిపించారు. ఇంకా నాలుగు బంతులు ఉండగా లక్ష్యాన్ని చేధించి ఏడు వికెట్ల ఆధిక్యంతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.