టీమిండియా సెలక్షన్‌లో ఈ పక్షపాతమేంటి: భజ్జీ

టీమిండియా సెలక్షన్‌లో ఈ పక్షపాతమేంటి: భజ్జీ

జాతీయ జట్టు సెలక్టర్లపై హర్భజన్ సింగ్ విమర్శలకు దిగాడు. సోమవారం భారత్ ఏ, బీ, సీ జట్లను ప్రకటించింది టీమిండియా సెలక్షన్ కమిటీ. శ్రీలంక, ఆస్ట్రేలియాలతో ఆడబోయే ద్వైపాక్షిక సిరీస్ కోసమే ఈ ఎంపిక జరిగింది. దాంతోపాటుగా ఇండియా ఏ జట్టు న్యూజిలాండ్ పర్యటన చేయాల్సి ఉంది. ఈ క్రమంలో విభిన్న ప్లేయర్లకు విభిన్న రూల్స్ ఉంటున్నాయా.. అంటూ సెలక్షన్ కమిటీని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. 

నేను ఆశ్చర్యపోతున్నాను. సూర్య కుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోకుండా పరుగులు రాబట్టలేని వారిని టీమిండియాలోకి (ఇండియా ఏ, ఇండియా బీ)తీసుకుంటున్నారు. ఒక్కో ప్లేయర్లకు ఒక్కో రూల్ ఎందుకు’ అంటూ మంగళవారం ట్వీట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 73మ్యాచ్‌లకు 4వేల 920పరుగులు చేశాడు. 

భజ్జీ సెలక్లర్లపై విమర్శలకు దిగడం కొత్తేం కాదు. నవంబరులోనూ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌కు జట్టులో చోటు ఇవ్వకపోవడంపై తిట్టిపోశాడు. వెస్టిండీస్‌తో కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ ను తుదిజట్టులోకి తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. 

‘సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుని అవకాశం ఇవ్వలేకపోయినందుకు చాలా అసంతృప్తిగా ఉంది. మూడు టీ20లకు డ్రింక్స్ మోస్తూనే గడిపేశాడు. అతని బ్యాటింగ్‌ను పరీక్షిస్తున్నారా.. అతని సహనాన్నా’ అంటూ శశిథరూర్ చేసిన ట్వీట్‌పై భజ్జీ రెస్సాండ్ అయ్యాడు. ‘నాకు తెలిసి వారు మనస్సును పరీక్షిస్తున్నారు. సెలక్షన్ ప్యానెల్‌లోకి స్ట్రాంగ్ పర్సన్స్ కావాలి. దాదా దానికి అనుగుణంగా ఎంపిక చేస్తాడని అనుకుంటున్నా’ అని ట్వీట్ చేశాడు.