Tokyo Olympics: ఒలింపిక్స్‌లో ఊహించని ట్విస్ట్.. రింగు దగ్గరే బాక్సర్ నిరసన

టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి అనర్హుడై నిష్క్రమించిన తర్వాత.. ఫ్రెంచ్ సూపర్ హెవీవెయిట్ బాక్సర్ మొరాద్ అలీవ్ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నాడు.

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో ఊహించని ట్విస్ట్.. రింగు దగ్గరే బాక్సర్ నిరసన

Boxer

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి అనర్హుడై నిష్క్రమించిన తర్వాత.. ఫ్రెంచ్ సూపర్ హెవీవెయిట్ బాక్సర్ మొరాద్ అలీవ్ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఒలింపిక్స్‌లో హెవీవెయిట్‌ బాక్సింగ్‌ విభాగంలో ఫ్రాన్స్‌ బాక్సర్‌ మొరాద్ అలీవ్ బ్రిటిష్‌ బాక్సర్‌ ఫ్రేజర్‌ క్లర్క్‌తో క్వార్టర్‌ ఫైనల్స్‌లో తలపడగా.. రెండవ రౌండ్‌లో మొరాద్‌పై రిఫరీ అండీ ముస్టాచియో అనర్హత వేటు వేశాడు. పలుమార్లు ప్రత్యర్థిపై ఉద్దేశపూర్వకంగా తలతో దాడి చేయడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు రిఫరీ.

ఈ క్రమంలోనే జడ్జ్‌లు మ్యాచ్‌లో ఫ్రేజర్‌ క్లర్క్‌ను విజేతగా ప్రకటించారు. దీనిపై ఫ్రాన్స్‌ బాక్సర్‌ బాక్సింగ్‌ రింగ్‌ వద్దే కూర్చొని నిరసన వ్యక్తం చేశాడు. కాసేపు నిరసన వ్యక్తం చేసిన తర్వాత వారి దేశానికి చెందిన వ్యక్తులు వచ్చి అతడితో మాట్లాడడంతో శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, 15 నిమిషాల తర్వాత మళ్లీ తిరిగొచ్చి అక్కడే కూర్చొని అసహనం వ్యక్తం చేశాడు.

మ్యాచ్‌లో ఆధ్యంతం మొరాద్‌ ఆధిపత్యం చెలాయించారు. ఫస్ట్ రౌండ్‌లోనే మొరాద్‌ ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. ఐదుగురు జడ్జ్‌లు వేసిన స్కోరులో మొరాద్‌‌కే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో మాత్రం ఇద్దరూ దూకుడుగా ఆడుతూ హోరాహోరీ తలపడ్డారు. ఈ క్రమంలోనే కొద్దిసేపట్లో మ్యాచ్‌ ముగుస్తుందనుకునే సమయంలో మొరాద్‌‌పై అనర్హత వేటు వేశాడు రిఫరీ.

ఇదే విషయమై బ్రిటిష్‌ బాక్సర్ ఫ్రేజర్‌ క్లర్క్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకమో లేకా అలా జరిగిపోయిందో అర్థం కాలేదు కానీ, క్రీడల్లో ఇటువంటి ప్రవర్తన మాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డాడు.