22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్న గంగూలీ

  • Published By: madhu ,Published On : November 25, 2020 / 11:27 AM IST
22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్న గంగూలీ

Ganguly has undergone corona tests 22 times : బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ నాలుగున్నర నెలల కాలంలో 22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నట్లు ప్రకటించారు. ఈ 22 టెస్టుల్లో ఏ ఒక్కసారి కూడా తనకు పాజిటివ్‌గా రాలేదన్నారు. యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ టోర్నీ సందర్భంగా అక్కడ పర్యటించాల్సి వచ్చిందని, ఆ తర్వాత దేశంలో కూడా పర్యటించే సమయంలో ఈ టెస్టులు చేయించుకున్నట్లు వెల్లడించారు.



తన ఆరోగ్యంతో పాట వృద్ధ దంపతులైన తన తల్లిదండ్రుల ఆరోగ్యం, భార్యా పిల్లల ఆరోగ్యం కోసం కరోనా టెస్టులు చేయించుకున్నానని దాదా తెలిపాడు. తన చుట్టూ పాజిటివ్ కేసులు ఉన్నాయని, తద్వారా నన్ను నేను పరీక్షించుకోవాల్సి వచ్చిందన్నాడు. సెలబ్రిటీలైన తమను ప్రజలు, కమ్యూనిటీ గమనిస్తున్నారని, కరోనాను మరొకరికి వ్యాప్తి చేయాలని అనుకోవడం లేదన్నారు. అందుకే కరోనా టెస్టులు చేయించుకుంటున్నట్లు తెలిపారు.



ఆస్ట్రేలియాలో కరోనా నిబంధనలు చాలా కఠినంగా అమలు చేస్తున్నారని, అందుకే అక్కడ కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 27న సిడ్నీ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో తొలి వన్డే మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు సిద్ధంగా ఉందని ప్రకటించాడు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారని, అద్భుతంగా రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. యూఏఈలో ఐపీఎల్ టోర్నీని సక్సెస్ ఫుల్‌గా ముగించడం సంతోషంగా ఉందన్నారు. బయోబబుల్‌లో దాదాపు 400 మంది క్రికెటర్లు, సహాయక సిబ్బంది ఉన్నారని.. ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు 40వేల కరోనా టెస్టులు చేసినట్లు వివరించారు.