Happy Birthday MS Dhoni: అపజయంతో మొదలై.. అప్రతిహతంగా పదిహేనేళ్లు.. ధోని కెరీర్ మలుపు తిప్పిన మ్యాచ్!

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఈ రోజు 40వ పడిలోకి అడుగుపెట్టారు. 'కెప్టెన్ కూల్'గా పిలుచుకునే ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు.

Happy Birthday MS Dhoni: అపజయంతో మొదలై.. అప్రతిహతంగా పదిహేనేళ్లు.. ధోని కెరీర్ మలుపు తిప్పిన మ్యాచ్!

Dhoni

Happy Birthday MS Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఈ రోజు 40వ పడిలోకి అడుగుపెట్టారు. ‘కెప్టెన్ కూల్’గా పిలుచుకునే ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. మూడు ఐసిసి ట్రోఫీలను భారత్‌కు అందించిన ఏకైక కెప్టెన్ ధోని. ధోని కెప్టెన్సీలో, 2007లో భారత్ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది, 2011లో వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్‌ గెలుచుకుంది టీమిండియా. ధోని కెప్టెన్సీలో, 2013లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కూడా కైవసం చేసుకుంది టీమ్ ఇండియా.

తన అధ్బుతమైన ఆటతీరుతో ఎందరో అభిమానులను దక్కించుకున్న ధోని, బంగ్లాదేశ్‌తో 2004లో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు మహ్మద్ కైఫ్ కారణంగా మ్యాచ్‌లో రనౌట్ అయ్యి, తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కూడా విఫలం అయ్యాడు. దీంతో ధోనీ కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించగా.. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ తీరాన విధ్వంస ఇన్నింగ్స్‌తో.. పాకిస్తాన్‌పై 123 బంతుల్లో 15 ఫోర్లు 4 సిక్స్‌ల సాయంతో 148పరుగులు చేసి తన సత్తాచాటుకున్నాడు. ధోని క్రికెట్ కెరీర్‌ని మలుపు తిప్పిన మ్యాచ్ ఇదే.

తర్వాత క్రికెట్‌లో ధోనీ తిరుగులేని శక్తిగా ఎదిగాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్‌గా భారత్‌ని విజేతగా నిలిపిన ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డుల్లో ఇప్పటికీ చెరగని పేరు లిఖించుకున్నాడు.

ధోని గత ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అంతకుముందు 2014 సంవత్సరంలో, ధోని ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా హఠాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2019 ప్రపంచ కప్(సెమీఫైనల్)లో న్యూజిలాండ్‌తో ధోని తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోగా.. క్రికెట్ చరిత్రలో ఒకశకం ముగిసినట్లుగా అభిమానులు భావించారు.

భారత క్రికెట్ జట్టు చరిత్రలో స్మార్ట్ నిర్ణయాలతో, మిస్టర్ కూల్‌గా, కొన్నిసార్లు బ్యాట్‌తో, కొన్నిసార్లు వికెట్ వెనుక ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టిన ఆటగాడు ధోని. క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన మరియు తెలివిగల కెప్టెన్‌లలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటారు.