దెబ్బకు దెబ్బ.. ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

దెబ్బకు దెబ్బ.. ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

INDvAUS: ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. తొలి సిరీస్ లో రెండు వన్డేలను గెలుచుకున్న ఆసీస్ కు ధీటైన సమాధానం చెబుతూ.. తొలి రెండు టీ20లలో విజయాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా దాదాపు సిరీస్ ఖాయమైనట్లే. నామమాత్రమైన మూడో టీ20మ్యాచ్‌ మంగళవారం జరగనుంది.

రెండో టీ20లో టీమిండియా 19.4 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శిఖర్‌ ధావన్‌(52; 36 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా(42 నాటౌట్‌; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి(40; 24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌(30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయాస్‌ అయ్యర్‌(12 నాటౌట్‌; 5 బంతుల్లో‌)లు రాణించడంతో జట్టు విజయతీరాలకు చేరింది.



ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. చేధనకు దిగిన టీమిండియా ఓపెనర్లు ధావన్‌, రాహుల్‌లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 56 పరుగులు చేరిన తర్వాత వీరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. రాహుల్‌ పెవిలియన్‌ చేరడంతో ధావన్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. హాఫ్‌ సెంచరీ సాధించిన కాసేపటికి ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. సంజూ శాంసన‌‌(15) ఆశించిన మేర ఆడలేకపోయాడు.

కోహ్లితో కలిసి 25 పరుగులు జత చేసి ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్‌తో కోహ్లీకి సమన్వయం కుదిరింది. మంచి దూకుడుపై కెప్టెన్ రాణిస్తున్న సమయంలో అవుట్ అయినా.. హార్దిక్‌-అయ్యర్‌లు సమయోచితంగా ఆడి మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చారు. పాండ్యా వీరబాదుడుతో భారీ లక్ష్యాన్ని సైతం బెదిరించారు.

చివరి రెండు ఓవర్లలో హార్దిక్‌ 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 25 పరుగులు రాబట్టాడు. ఫలితంగా టీమిండియా ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదుచేసుకోగలిగింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ మాథ్యూ వేడ్‌ హాఫ్‌ సెంచరీకి తోడూ స్మిత్‌ కూడా రాణించడంతో రెండో టీ 20లో టీమిండియాకు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో నటరాజన్‌ రెండు, చాహల్‌, ఠాకూర్‌లు చెరో వికెట్‌ తీయగలిగారు.