IPL 2019: పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఇమ్రాన్ తాహిర్

IPL 2019: పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఇమ్రాన్ తాహిర్

ఐపీఎల్ 2019 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్  పర్పుల్ క్యాప్‌తో ముగించాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఫైనల్‌లో 2వికెట్లు తీసి సీజన్ మొత్తంలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు. ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్ 2వికెట్లు తాహిర్ చేతికి చిక్కాయి. 

40ఏళ్ల ఇమ్రాన్ 17మ్యాచ్‌ల్లో 26వికెట్లు పడగొట్టాడు. అతని తర్వాత వరసలో కగిసో రబాడ 25వికెట్లు తీసి రెండో ప్లేయర్‌గా నిలిచాడు. రబాడ వరల్డ్ కప్ క్యాంప్ కోసం జట్టు వదిలి వెళ్లాల్సి వచ్చింది. లేకపోతే అతనే పర్పుల్ క్యాప్ దక్కించుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ సీనియర్ బౌలర్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్ కనిపించింది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ అనంతరం వైట్ బాల్ క్రికెట్ ఆడేందుకు దక్షిణాఫ్రికా పిలుపునిచ్చింది. 

2012వ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా సునీల్ నరైన్ రికార్డును ఇమ్రాన్ తాహిర్ అధిగమించేశాడు. పర్పుల్ క్యాప్ అందుకున్న సంతోషంలో ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఈ వయస్సులోనూ చెన్నై సూపర్ కింగ్స్ నాకు అవకాశమిచ్చినందుకు సంతోషిస్తున్నా. జట్టు, కెప్టెన్ సహకారం వల్లనే ఇది సాధ్యమైందని తెలిపాడు.