India vs Australia 4th Test Match: 6 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. ఆస్ట్రేలియా ఆలౌట్.. Live Updates

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు, రెండో రోజు ఆట కొనసాగుతోంది. గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

India vs Australia 4th Test Match: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు, రెండో రోజు ఆట కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఆసీస్ 255/4 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించింది. 167.2 ఓవర్లలో 480 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచులో 6 వికెట్లు పడగొట్టాడు.

 

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 10 Mar 2023 05:06 PM (IST)

    రెండో రోజు ముగిసిన ఆట.. 444 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

    ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు, రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ ఉదయం ఆసీస్ 255/4 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్167.2 ఓవర్లలో 480 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మ్యాచు ముగిసే సమయానికి 36 పరుగులు (10 ఓవర్లలో) చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 17, శుభ్ మన్ గిల్ 18 పరుగులతో ఉన్నారు. మొదటి ఇన్నింగ్సులో ప్రస్తుతం ఆస్ట్రేలియా 444 పరుగుల ఆధిక్యంలో ఉంది.

  • 10 Mar 2023 04:00 PM (IST)

    6 వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్.. ఆస్ట్రేలియా ఆలౌట్

    ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. 167.2 ఓవర్లలో 480 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచులో 6 వికెట్లు పడగొట్టాడు. ఇక మొహమ్మద్ షమీ 2, జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.

  • 10 Mar 2023 03:53 PM (IST)

    9వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 9వ వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్ ముర్ఫీ 41 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

  • 10 Mar 2023 02:53 PM (IST)

    ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. స్కోరు 422/8

    ఆస్ట్రేలియా 409 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. భారీ స్కోరు సాధించిన ఉస్మాన్ ఖవాజా 422 బంతుల్లో 180 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఖవాజా ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో నాథన్ లయన్ 10 పరుగులతో, టాడ్ ముర్ఫీ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

     

  • 10 Mar 2023 01:37 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 387 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ ఔటయ్యాడు. 20 బంతులు ఎదుర్కొన్న స్టార్క్, 6 పరుగులే చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో అశ్విన్ నాలుగు వికెట్లు తీయడం విశేషం. స్టార్క్ స్థానంలో నాథన్ లయన్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 393/7 (138)

  • 10 Mar 2023 01:10 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. క్యారీ డకౌట్

    ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. కామెరూన్ గ్రీన్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కీపర్, బ్యాటర్ అలెక్స్ క్యారీ డకౌట్‌గా వెనుదిరిగాడు. పరుగులేమీ చేయకుండానే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న క్యారీ దూకుడుగా, భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. క్యారీ తర్వాత మిచెల్ స్టార్క్ బ్యాటింగ్‌కు దిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 383/6.

  • 10 Mar 2023 01:05 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 378 పరుగుల వద్ద కామెరూన్ గ్రీన్ ఔటయ్యాడు. టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసిన కామెరూన్ 170 బంతుల్లో 114 పరుగులు చేసి ఔటయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కామెరూన్ ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు ఉన్నాయి. దాదాపు 60 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 378/5.

  • 10 Mar 2023 12:50 PM (IST)

    భారత బౌలర్లకు పరీక్ష పెడుతున్న ఖవాజా-కామెరూన్

    170 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టును ఖవాజా-కామెరూన్ గ్రీన్ ఆదుకున్నారు. ఇద్దరూ వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నారు. ఇద్దరూ కలిసి డబుల్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్ నమోదు చేశారు. 57 ఓవర్లుగా ఒక్క వికెట్ కూడా పోలేదంటే ఇద్దరూ ఎలా ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇద్దరి భాగస్వామ్యన్ని విడగొట్టడం భారత బౌలర్లకు సవాలుగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.

  • 10 Mar 2023 12:44 PM (IST)

    200 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్న ఖవాజా-కామెరూన్

    ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా-కామెరూన్ గ్రీన్ భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. నిలకడగా ఆడుతూ ఇద్దరూ కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకుని, ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించే దిశగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మాన్ ఖవాజా 159 పరుగులతో, కామెరూన్ గ్రీన్ 111 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 372/4 (126)

  • 10 Mar 2023 12:28 PM (IST)

    సెంచరీ పూర్తి చేసుకున్న కామెరూన్ గ్రీన్

    కామెరూన్ గ్రీన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 143 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. జడేజా బౌలింగ్‌లో ఫోర్ కొట్టడం ద్వారా కామెరూన్ సెంచరీ నమోదు చేశాడు. ఇది అతడికి ఇండియాలో తొలి శతకం. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు ఉండటం విశేషం.

  • 10 Mar 2023 11:44 AM (IST)

    150 పరుగులు పూర్తి చేసిన ఖవాజా

    ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 354 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 42 సగటుతో నిలకడగా ఆడుతున్నాడు. ఖవాజా సాధించిన పరుగుల్లో సగానికిపైగా ఫోర్లే ఉండటం విశేషం. అతడు 20 ఫోర్లు సాధించాడు. మరో బ్యాటర్ కామెరాన్ గ్రీన్ సెంచరీ దిశగా సాగుతున్నాడు

  • 10 Mar 2023 10:17 AM (IST)

    కామెరాన్ అర్ధ సెంచరీ

    కామెరాన్ గ్రీన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 49 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన కామెరాన్ గ్రీన్ జడేజా బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 102 ఓవర్లకు 277/4గా ఉంది. ఖవాజా 115 పరుగులతో, కామెరాన్ గ్రీన్ 60 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు