సిక్సర్‌తో సెంచరీ పూర్తిచేసిన పంత్.. ముచ్చటగా మూడో సెంచరీ

సిక్సర్‌తో సెంచరీ పూర్తిచేసిన పంత్.. ముచ్చటగా మూడో సెంచరీ

Rishabh Pant hits 3rd Test century first in India : ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న ఆఖరి నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పట్టు బిగుస్తోంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తుచేస్తూ సిక్సర్‌తో సెంచరీ నమోదు చేశాడు. నిలకడగా ఆడుతూ పంత్ 115 బంతుల్లో (13 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో) సెంచరీ పూర్తి చేశాడు. 94 పరుగుల వద్ద రూట్ వేసిన 84ఓవర్ బంతిని భారీ సిక్సర్ గా మలిచిన పంత్ మూడో శతకాన్ని నమోదు చేశాడు.

టెస్టుల్లో ఇది మూడో సెంచరీ కాగా.. తన సొంత గడ్డపై టెస్టుల్లో పంత్ తొలి సెంచరీ.. అందులో ఒకటి ఇంగ్లాండ్, రెండోది ఆస్ట్రేలియాలో సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లండ్ కొత్త బాల్ తీసుకున్న త‌ర్వాత వ‌రుస ఫోర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. టీమిండియా కీల‌క‌మైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. సెంచరీ చేసిన పంత్ ఆ తర్వాత ఆండర్సన్ బౌలింగ్‌లో 105 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. 84.1వ బంతిని భారీ షాట్ ఆడేందుకు యత్నించి రూట్ కు క్యాచ్ ఇవ్వడంతో పంత్ పోరాటం ముగిసింది.

వాషింగ్ట‌న్ సుంద‌ర్‌తో క‌లిసి పంత్‌ ఏడో వికెట్‌కు 113 ప‌రుగుల పార్ట్‌న‌ర్‌షిప్ నెలకొల్పాడు. సుంద‌ర్ కూడా హాఫ్ సెంచ‌రీ నమోదు చేశాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ (57), అక్షర్ పటేల్ (10) క్రీజులో ఉన్నారు. టీమిండియా 91 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 290 పరుగులతో కొనసాగుతోంది. భారత్ ఇంగ్లండ్‌పై 85 పరుగుల ఆధిక్యంలో ఉంది.