Ind Vs SA : మరో ఓటమి.. వన్డే సిరీస్ కూడా కోల్పోయిన భారత్

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో ఓడిన భారత్.. వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది.

Ind Vs SA : మరో ఓటమి.. వన్డే సిరీస్ కూడా కోల్పోయిన భారత్

Ind Vs Sa Second Odi

Ind Vs SA : సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో ఓడిన భారత్.. వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో వన్డే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. భారత్‌ నిర్దేశించిన 288 పరుగుల టార్గెట్ ని సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ గెలుపుతో మరో వన్డే మ్యాచ్ ఉండగానే మూడు వన్డేల సిరీస్ ను సౌతాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది.

దక్షిణాఫ్రికా ఓపెనర్లు మలన్‌ ( 108 బంతుల్లో 91 పరుగులు 8 ఫోర్లు, 1 సిక్స్‌), క్వింటన్ డికాక్‌ (66 బంతుల్లో 78 పరగులు 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించగా.. డసెన్‌ (37), మార్‌క్రమ్‌ (37), బవుమా (35) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో చాహల్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌ తలో వికెట్ తీశారు.

సౌతాఫ్రికాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా క్వింటన్ డికాక్‌ ఆది నుంచి దూకుడుగా ఆడాడు. మలన్‌ కూడా నిలకడగా ఆడాడు. దీంతో పది ఓవర్లు పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా 66/0తో నిలిచింది. డికాక్‌ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత మలన్‌ దూకుడు పెంచాడు. 66 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత సెంచరీ వైపు దూసుకెళ్తున్న మలన్‌ని బుమ్రా పెవిలియన్‌కి పంపాడు. తర్వాతి ఓవర్‌లోనే బవుమా (35) చాహల్‌ బౌలింగ్‌లో అతడికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డసెన్‌, మార్‌క్రమ్‌ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టుని గెలిపించారు.

పార్ల్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా చాలెంజింగ్ స్కోరే చేసింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ ధాటిగా ఆడాడు. 71 బంతుల్లోనే 85 పరుగులు సాధించాడు. పంత్ ధనాధన్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్ 55(79 బంతులు), శిఖర్ ధావన్ 29 పరుగులు చేశారు.

లోయరార్డర్ లో శార్దూల్ ఠాకూర్ 38 బంతుల్లో 40 పరుగులు, అశ్విన్ 25 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వెంకటేశ్ అయ్యర్ 22 పరుగులు సాధించాడు. పంత్, రాహుల్, శార్దూల్ రాణించడంతో భారత్ భారీ స్కోరే చేసింది. అయితే తొలి వన్డేలో అదరగొట్టిన విరాట్ కోహ్లీ రెండో వన్డేలో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. శ్రేయాస్ అయ్యర్ (11) కూడా విఫలమయ్యాడు. సఫారీ బౌలర్లలో తబ్రైజ్ షంసీ 2 వికెట్లు తీశాడు. మగళ, మార్ క్రమ్, కేశవ్ మహరాజ్, ఫెహ్లుక్వాయో తలో వికెట్ తీశారు.

స్కోర్లు
భారత్ – 287/6
దక్షిణాఫ్రికా – 288/3