సాగర తీరాన సమరానికి సిద్ధమైన భారత్ vs విండీస్

సాగర తీరాన సమరానికి సిద్ధమైన భారత్ vs విండీస్

పరాజయంపై ప్రతీకారం తీర్చుకునేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. టీమిండియాకు బాగా కలిసొచ్చిన విశాఖ తీరంలో విండీస్ జట్టుతో రెండో వన్డేలో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడనుంది. మొదటి మ్యాచ్‌ను గెలిచి ఊపుమీదున్న కరేబియన్లు.. ఈ మ్యాచ్‌లోనూ విజయం  సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న భారత జట్టు.. సిరీస్‌పై ఆశలు సజీవం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విశాఖలో అద్భుత రికార్డు ఉన్న కోహ్లి, రోహిత్‌లలో ఏ ఒక్కరు చెలరేగినా విండీస్‌కు కష్టాలు తప్పవు. రెండో ఓపెనర్‌గా రాహుల్‌ బాగా ఆడుతున్నాడు కాబట్టి మయాంక్‌ అగర్వాల్‌కు ప్రస్తుతానికి అవకాశం లేనట్టే. యువ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్,  రిషభ్‌ పంత్‌ రాణించడం భారత్‌కు కలిసొచ్చే అంశం. తొలి వన్డేలో ఓడినా ఓవరాల్‌గా భారత జట్టు పటిష్టంగానే ఉంది. అందరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే గెలుపు నల్లేరుపై నడకనే చెప్పాలి.

టీ20 సిరీస్‌ గెలుచుకున్న భారత్‌ జోరుకు చెన్నై వన్డేలో కళ్లెం వేసింది విండీస్ టీమ్. గత మ్యాచ్‌లో టాపార్డర్‌ వైఫల్యంతో ఓటమిని ఎదుర్కొన్న కోహ్లి సేన ఇప్పుడు పట్టుదలగా విశాఖ సమరానికి రెడీ అయింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలిచే  స్థితిలో టీమిండియా ఉండగా… మరో విజయంతో 2002 తర్వాత భారత గడ్డపై వన్డే సిరీస్‌ను అందుకోవాలని పొలార్డ్‌ బృందం పట్టుదలతో ఉంది.

చెన్నైలో 288పరుగులు చేసినా.. దానిని భారత్ నిలబెట్టుకోలేక పోయింది. భారత బౌలర్ల వైఫల్యాన్ని విండీస్ బ్యాట్స్‌మెన్ రన్స్‌గా మార్చుకున్నారు. ఫాస్ట్ బౌలర్లు మొదలుకొని స్పిన్నర్ల వరకు అందరినీ ఉతికారేశారు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌కంటే  ఒక స్పెషలిస్ట్‌ బౌలర్‌ అదనంగా జట్టులో ఉంటే మంచిదని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. భిన్నమైన బంతులతో ప్రత్యర్థిని దెబ్బ తీయగల చహల్‌ను ఎంపిక చేసే అవకాశముంది. గత మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా కలిసి పెద్దగా  ప్రభావం చూపలేకపోవడంతో ఈ లెగ్‌ స్పిన్నర్‌కు చాన్స్ దక్కవచ్చని స్పోర్ట్స్ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే శివమ్‌ దూబే, జడేజాలలో ఒకరిని పక్కన పెట్టే అవకాశం ఉంది. షమీ, దీపక్‌ చాహర్‌ ధారాళంగా పరుగులిస్తున్నారు. వారిద్దరూ మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. బౌలింగ్‌లో కేదార్‌ జాదవ్‌ ప్రత్యేకత చూపించకపోయినా అతను చేసిన కీలక పరుగులు జట్టులో స్థానానికి ఢోకా లేకుండా చేశాయి. 

ఇక విండీస్ విషయానికొస్తే… సిరీస్‌ని విజయంతో ప్రారంభించడం వెస్టిండీస్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా హెట్‌మైర్, షై హోప్‌ బ్యాటింగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు. సరిగ్గా ఏడాది క్రితం వైజాగ్‌ వేదికపై వీరిద్దరు చక్కటి ఇన్నింగ్స్‌లతో తమ  జట్టును ఓటమి నుంచి కాపాడి మ్యాచ్‌ను టైగా ముగించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో చెలరేగితే భారత బౌలర్లు మరోసారి బౌండరీల వైపు చూడక తప్పదు. పూరన్, పొలార్డ్‌లతో కరేబియన్ జట్టు బ్యాటింగ్‌ మరింత బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌కు  అనుకూలమైన విశాఖ పిచ్‌పై పేసర్లు కాట్రెల్, జోసెఫ్, హోల్డర్‌ ఎలా ప్రత్యర్థిని నిలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. స్పిన్నర్లు  వాల్ష్, ఛేజ్‌ కూడా గత మ్యాచ్‌లో మెరుగ్గానే బౌలింగ్‌ చేశారు. అయితే మొత్తంగా చూస్తే విండీస్‌ విజయరహస్యం,  బలమంతా ఆ జట్టు విధ్వంసక బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉంది. 

స్టేడియం: విశాఖలో వైఎస్సాఆర్ స్టేడియం
టైం: మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 
ప్రసారం: స్టార్‌ స్పోర్ట్స్‌లో
పిచ్ స్వభావం: బ్యాటింగ్ ట్రాక్ స్పిన్నర్లకు బాగా అనుకూలించేలా కనిపిస్తుంది. 2018లో జరిగిన మ్యాచ్ లో ఇరు జట్లు మొత్తంగా 600పరుగుల స్కోరు చేశాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలకు కలిసి వచ్చేలా ఉంది వాతావరణం. 

తుది జట్లు‘(అంచనా):
టీమిండియా:
Rahul, Rohit, Kohli(C), Iyer, Pant(WK), Jadhav, Jadeja, Dube/Chahal, Chahar, Shami and Kuldeep.
వెస్టిండీస్: Ambris, Hope, Hetmyer, Chase, Pooran(WK), Pollard(C), Holder, Walsh, Paul, Joseph and Cottrell.