నిర్ణయాత్మక వన్డే: 2కీలక మార్పులతో కోహ్లీసేన

నిర్ణయాత్మక వన్డే: 2కీలక మార్పులతో కోహ్లీసేన

వన్డే సిరీస్‌లో ఆఖరిదైన మూడో వన్డే ఆడేందుకు కటక్ వేదికగా వెస్టిండీస్, భారత్‌లు సిద్ధమయ్యాయి. వెస్టిండీస్ పర్యటనలో ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో పోరు ఉత్కంఠతగా మారనుంది. టీ20 సిరీస్‌ను కోల్పోయిన విండీస్‌ను వన్డేసిరీస్‌నైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేల్లోనూ ఇరుజట్లు చెరో మ్యాచ్‌ను గెల్చుకున్నాయి. 

భారత్‌ ఆటగాడు దీపక్‌ చాహర్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. నవదీప్‌ సైనీ ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ఒత్తిడితో నిండిన చివరి పోరులో అతడికి అవకాశం ఇస్తే ఏమాత్రం ప్రభావం చూపగలడనేది కీలకం. మరో పేసర్‌ శార్దుల్‌ కూడా అంతంత మాత్రంగానే బౌలింగ్‌ చేస్తున్నాడు. దాంతో సీనియర్‌ షమీపై భారం మరింత పెరిగింది. వైజాగ్‌ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో అదరగొట్టిన కుల్దీప్‌ యాదవ్‌ మరోసారి కీలకం కానున్నాడు. భారత్‌ అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశముంది. అదే జరిగితే శార్దుల్‌ స్థానంలో చాహల్‌కు అవకాశం దక్కవచ్చు. 
 
బ్యాటింగ్‌ విభాగంలో భారత్‌ పటిష్టంగా ఉంది. కోహ్లిలాంటి స్టార్‌ డకౌట్‌ అయినా… జట్టు 387 పరుగులు సాధించింది. భారత్‌ బ్యాటింగ్‌లో ఎంత పటిష్టంగా ఉందో అంచనా వేయవచ్చు. ఓపెనర్లు రోహిత్, రాహుల్‌ తిరుగులేని బ్యాటింగ్‌ మరోసారి భారత్‌కు శుభారంభం అందిస్తే  ప్రత్యర్థికి కష్టాలు తప్పవు.  యువ ఆటగాళ్లు అయ్యర్, పంత్‌ జంటగా చెలరేగుతుండడం జట్టుకు శుభపరిణామం. ఆ తర్వాత బ్యాటింగ్‌లో జాదవ్, జడేజా జట్టుకు తమవంతు పాత్ర పోషిస్తున్నారు.  ఆటగాళ్లంతా తమపైనున్న అంచనాలకు అనుగుణంగా ఆడితే టీమ్‌ ఇండియా విజయాన్ని ఎవరూ ఆపలేరు.
 
విండీస్‌ ఆటగాళ్లలో సెకండ్‌ వన్డేలో బ్యాట్స్‌మెన్స్‌తోపాటు బౌలర్లూ విఫలమయ్యారు. కాట్రెల్‌ మళ్లీ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. అతనికి తోడుగా జోసెఫ్, హోల్డర్‌ అండగా నిలవడం కీలకం. స్పిన్నర్‌ ఖారీ పైర్‌ బౌలింగ్‌పై  విండీస్‌ ఆశలుపెట్టుకుంది. బ్యాటింగ్‌లో హోప్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, మరో ఓపెనర్‌ లూయిస్‌ కూడా చెలరేగిపోతున్నాడు. ఇక హెట్‌మేయర్‌ కూడా రాణిస్తే.. మ్యాచ్‌ను మలుపు తిప్పేయగలడు. హెట్‌మేయర్‌ను, పూరన్‌తోపాటు కెప్టెన్ పొలార్డ్‌ను నిలువరించడం భారత్‌ టార్గెట్‌ ఉండాలి. వీరు ముగ్గురూ రాణించినా భారత్‌కు చిక్కులు తప్పవు. మొత్తంగా విశాఖ మ్యాచ్‌ తరహాలోనే వెస్టిండీస్‌ను చిత్తు చేసి 2019ని ఘనంగా ముగించాలని విరాట్‌ సేన  పట్టుదలగా ఉంది. 

టీమిండియా: Rohit, Rahul, Virat(C), Iyer, Pant (WK), Jadhav, Dube/Jadeja, Shami, Chahal/Saini, Kuldeep and Thakur.
విండీస్:  Hope, Lewis, Hetmyer, Pooran(WK), Chase, Pollard(C), Holder, Pierre, Paul, Cottrell and Joseph.

మ్యాచ్ వివరాలు:
సమయం:
డిసెంబరు 22, మధ్యాహ్నం 1:30గంటలకు
వేదిక: బరాబతి స్టేడియం, కటక్

పిచ్ రిపోర్టు: 
ఇదే వేదికగా 2017లో ఇంగ్లాండ్, ఇండియాల మధ్య జరిగిన మ్యాచ్‌లో 750పరుగులు వచ్చాయి. స్పిన్నర్లకు బాగా కలిసొచ్చి మైదానంలో చేజింగ్ చేసే జట్టుకు కాస్త కష్టమే.