ICCకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా

ICCకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా

అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రజట్లుగా దూసుకెళ్తున్న ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు (ఐసీసీ)కి షాక్ ఇవ్వనున్నాయి. అక్టోబరులో జరిగిన సమావేశంలో మరో 50ఓవర్ల ఫార్మాట్‌ను మొదలుపెట్టాలని ఐసీసీ నిర్ణయించింది. ఐసీసీ పూచర్ టూర్స్ ప్రోగ్రామ్ లో భాగంగా దీనిని 2021నుంచి అమలులోకి తేవాలనుకుంది. వీటిని పట్టించుకోకుండా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఈ టోర్నమెంట్ పై తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

అతనిని అనుసరిస్తూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కూడా సమ్మతిని తెలియజేసింది. ‘క్రికెట్ ఆడే కీలక దేశాలతో మేం తరచూ మీట్ అవుతూనే ఉంటాం. టాపిక్ లు చర్చించుకుని కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటాం. ఇలాగే నాలుగు దేశాల టోర్నమెంట్ గురించి బీసీసీఐతో డిసెంబరులో మాట్లాడాం. దీనిపై ఐసీసీ సీరియస్‌గా ఉంటే ఓ సారి కలిసి మాట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

దీనిపై జనవరిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడే సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు అధికారులతో చర్చించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఐసీసీ మరో ప్రపంచ స్థాయి ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్ పెట్టింది. అక్టోబరులో జరిగిన మీటింగ్‌లో టీ20, 50ఓవర్ల వరల్డ్ కప్ టోర్నమెంట్లు కాకుండా.. 2023-2031 ఎనిమిదేళ్ల పాటు వీటిని నిర్వహించాలనుకున్నట్లు తెలిపింది. ఈ కాలంలో రెండు 50ఓవర్ వరల్డ్ కప్‌లు, 4 టీ20 వరల్డ్ కప్‌లు, రెండు 50ఓవర్ ఫార్మాట్లు ఆడించాలనుకుంది.

దీనిని బీసీసీఐ, ఈసీబీ తిరస్కరించింది. దానికి ద్వైపాక్షిక క్యాలెండర్ మొత్తం కేటాయించాల్సి వస్తుందని ఫలితంగా కమర్షియల్ గా లాభం ఉండదనే అభిప్రాయంతో ఉన్నాయి. దీనిపై కోల్‌కతా వేదికగా మాట్లాడిన గంగూలీ.. ‘ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియాలతో పాటు మరో అగ్ర జట్టు 2021 నుంచి ఆరంభం కానున్న సూపర్ సిరీస్ లో ఆడనున్నాయి’ అని తెలిపాడు.

ట్రెజరర్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘మూడు అంతర్జాతీయ జట్ల కంటే ఎక్కువ కలిసి టోర్నమెంట్ ఆడుతుంటే కచ్చితంగా ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. క్యాలెండర్ ఇయర్‌లో ఖాళీగా ఉండే సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. సిరీస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాం. బీసీసీఐ అనుకున్నట్లుగానే సాగితే అలానే చేస్తాం’ అని వెల్లడించాడు.