భారత్ – ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్, రోహిత్ శర్మ నవ్వుల్..పువ్వుల్

భారత్ – ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్, రోహిత్ శర్మ నవ్వుల్..పువ్వుల్

India – England Test match : చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో తొలిరోజు ఆటలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగి ఆడారు. ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన టీమిండియా.. సుమారు ఏడాది తర్వాత సొంత గ్రౌండ్‌లో పూర్తిగా నిరాశపర్చింది. కెరీర్ లో 100 వ టెస్ట్ ఆడుతున్న కెప్టెన్ జో రూట్ సెంచరీ చేయడంతో తొలి రోజు పూర్తిగా ఇంగ్లండ్ పై చేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 263 ప‌రుగులు చేసింది. అయితే, టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మైదానంలో నవ్వులు పూయించడం హైలెట్‌.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 38వ ఓవర్‌లో అతను హెల్మెట్‌ పెట్టుకొని సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. రోహిత్‌ ఇలా చేయడాన్ని చూసిన భారత ఆటగాళ్లు తొలుత ఆశ్చర్యానికి గురైనా, ఆ తరువాత రోహిత్‌ ప్రవర్తనను చూసి ముసి ముసిగా నవ్వుకున్నారు. థర్డ్ స్లిప్‌లో ఉన్న రహానే, వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌లు అయితే ఆ ఓవర్ మొత్తం నవ్వుతూ కనిపించారు. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో జో రూట్‌ డిఫెన్స్‌ ఆడిన బంతి గాల్లోకి లేచి రోహిత్‌కు ముందు కొద్ది దూరంలో పడింది. దీంతో అతను షార్ట్ లెగ్‌‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ నుంచి హెల్మెట్ తీసుకుని కొద్దిగా ముందుకు వచ్చి నిలబడ్డాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. ఓపెనర్లు మంచి శుభారంభమే అందించారు. ఓపెనర్ బర్న్స్ (33) పరుగులకు అవుట్ కాగా..మరో ఓపెనర్ సిబ్లి (87) రన్లు సాధించి సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివరి ఓవర్ లో బుమ్రా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. కెప్టెన్ జో రూట్ (123 నాటౌట్) కు చక్కటి సహకారం అందించాడు. కెప్టెన్ జో రూట్‌కి ఇది 100వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. అంతేకాకుండా గత కొంతకాలం అతడు టెస్టుల్లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరి ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. మొదటి సెషన్ లో టీమిండియా బౌలర్లు రూట్ ను పెవిలియన్ కు పంపిస్తే…మ్యాచ్ పై పట్టు సాధించే ఛాన్స్ ఉంది.