చేజారిన సిరీస్: 2 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా ఉమెన్స్

చేజారిన సిరీస్: 2 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా ఉమెన్స్

న్యూజిలాండ్‌ గడ్డపై ముగిసిన టీ20 ఫార్మాట్‌లో కివీస్ మహిళా జట్టు భారత్‌ను క్లీన్ స్వీప్ చేసింది. హామిల్టన్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో స్వల్ప వ్యత్యాసమైన 2పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయి సిరీస్‌ను పేలవంగా ముగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్.. టీమిండియా మహిళల జట్టు ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌ ఓపెనర్లు శుభారంభాన్ని నమోదు చేయగా ఆరో ఓవర్లో సూజీ బేట్స్ తొలి వికెట్ గా వెనుదిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హన్నా రోవ్‌ 12 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సోఫీ డివైన్‌(72) రాణించడంతో ఆ జట్టు మంచి స్కోర్‌ చేయగలిగింది. శాటెర్త్‌వైట్‌(31)తో కలిసి డివైన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. మ్యాచ్ ఆఖర్లో టీమిండియా మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టింది. 

దీంతో 20 ఓవర్లలో కివీస్‌ అమ్మాయిలు ఏడు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో దీప్తి రెండు వికెట్లు, మాన్సి జోషీ, రాధా యాదవ్‌, అరుంధతీ రెడ్డి, పూనమ్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీశారు. చేధనలో భారత మహిళలు స్మృతి మంధాన(86)ను మినహాయించి మిగిలిన వారంతా పేలవమైన ప్రదర్శనతో వెనుదిరిగారు. మ్యాచ్ ముగిసే సమయానికి మిథాలీ రాజ్(24), దీప్తి శర్మ(21)క్రీజులో ఉన్నారు. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఇంకా 2 పరుగులు చేయాల్సి ఉండడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.