రోహిత్ శర్మ వ్యూహం.. భారత్‌దే నాల్గవ మ్యాచ్.. లెవెల్ అయిపోయింది

ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 8పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఒకటి నువ్వు.. ఒకటి నేను అన్నట్లుగా సాగుతోంది.

రోహిత్ శర్మ వ్యూహం.. భారత్‌దే నాల్గవ మ్యాచ్.. లెవెల్ అయిపోయింది

India Vs England 4th T20i Thakur Surya Shines India Beats England By 8 Runs1

IND vs ENG 4th T20I : ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 8పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఒకటి నువ్వు.. ఒకటి నేను అన్నట్లుగా సాగుతోంది. లేటెస్ట్ విజయంతో సిరీస్ 2-2తో లెవెల్ అయిపోయింది. తొలి మూడు టీ20లు టాస్‌ గెలిచిన జట్టే ఫీల్డింగ్‌ ఎంచుకుని గెలుపు రుచి చూడగా.. నాల్గవ మ్యాచ్.. విజయం కచ్చితంగా అవసరం అనుకున్న సమయంలో టాస్ ఓడినా.. ఇంగ్లాండ్ జట్టును కట్టడి చేసింది కోహ్లీసేన.

మొదట్లోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయినా కూడా సూర్యకుమార్‌ యాదవ్‌ (57) చెలరేగి ఆడడంతో.. భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (37), రిషబ్‌ పంత్‌ (30) జట్టును ఆదుకున్నారు. రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లీ మాత్రం ఈ మ్యాచ్‌లో రాణించలేదు. తర్వాత శార్దూల్‌, హార్దిక్‌ల చక్కని బౌలింగ్‌.. సిరీస్‌ ఆశలను నిలబెట్టింది. చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠగా మ్యాచ్‌లో భారత్ గెలిచింది. చివరి నాలుగు ఓవర్లలో విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

కెప్టెన్ విరాట్ 16 ఓవర్లలో గాయపడి కూర్చోవలసి రాగా.. కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ చేతుల్లోకి వెళ్లాయి. ఈ మ్యాచ్ 16 ఓవర్లకు ఇంగ్లాండ్‌కు అనుకూలంగా ఉన్నట్లు అనిపించింది, కానీ రోహిత్ వ్యూహం ఇంగ్లీష్ జట్టును కట్టడి చేసింది. రోహిత్ శర్మ 16వ ఓవర్లో బౌలింగ్ కోసం శార్దుల్ ఠాకూర్ ను పిలిచాడు. బౌలింగ్‌కు వెళ్లేముందు కెప్టెన్ అతనికి ఏదో వివరించాడు. మొదటి వికెట్‌లో బెన్ స్టోక్స్‌ను అవుట్ చేశాడు. 46 పరుగులతో ఆడుతున్న స్టోక్స్ సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చాడు. తరువాతి బంతిలోనే, శార్దుల్ ఇంగ్లీష్ కెప్టెన్ మోర్గాన్‌ను కూడా అవుట్ చేశాడు.

తర్వాత రోహిత్ హార్దిక్‌కు అవకాశం ఇచ్చాడు. సామ్ కుర్రాన్‌ను ఆ ఓవర్‌లోనే అవుట్ చేశాడు హార్థిక్. చివరి ఓవర్లో శార్దుల్ ఇంగ్లాండ్ 23 పరుగులు చేయాల్సిన సమయంలో.. మొదటి మూడు బంతుల్లోనే 13పరుగులు ఇచ్చేశాడు. మూడు బంతుల్లో కేవలం 10పరుగులు అవసరం అనుకున్న సమయంలో ఇంగ్లాండ్ జట్టుపై రోహిత్ వ్యూహం ఫలించింది. శార్దూల్ ఠాకూర్‌కు రోహిత్ ఏదో చెప్పగా తర్వాతి బంతికి సింగిల్ మాత్రంమే ఇచ్చాడు. చివరకు 8పరుగుల విజయంలో కీలకంగా వ్యవహరించారు.

ఈ మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అయినా.. స్టోక్స్‌, బెయిర్‌స్టో జోడీ ఆడుతున్నంత సేపు.. ఇంగ్లీష్ జట్టు గెలుస్తుందేమో అన్నట్లుగా అనిపించింది. 15వ ఓవర్లో బెయిర్‌స్టో అవుట్ అవ్వగా.. వరుస బంతుల్లో స్టోక్స్‌, కెప్టెన్‌ మోర్గాన్‌ అవుట్ అవ్వడంతో మ్యాచ్ మారిపోయింది. భారత్ చేతుల్లోకి వచ్చినట్లుగా అనిపించింది. అయితే చివర్లో ఆర్చర్ మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది.