India vs England: కోహ్లీ.. పూజారాల పోరాటం

పరాభవం వెంటాడుతున్నా ఆతిథ్య జట్టుపై పోరాడుతూనే ఉంది టీమిండియా. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

India vs England: కోహ్లీ.. పూజారాల పోరాటం

Kohli Pujara

India vs England: పరాభవం వెంటాడుతున్నా ఆతిథ్య జట్టుపై పోరాడుతూనే ఉంది టీమిండియా. మూడో టెస్టులో పట్టుదలను ప్రదర్శిస్తూ మూడో రోజంతా క్రీజులో నిలిచింది. పుజారా (91 బ్యాటింగ్‌; 180 బంతుల్లో 15 ఫోర్లు), రోహిత్‌ (59; 156 బంతుల్లో 7ఫోర్లు, సిక్సు) అద్భుతంగా పోరాడడంతో మూడో రోజు, శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

కెప్టెన్‌ కోహ్లి (45 బ్యాటింగ్‌; 94 బంతుల్లో 6ఫోర్లు)మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. పుజారాతో పాటు అజేయంగా నిలిచాడు. పట్టుదలతో కనిపిస్తున్న భారత్‌కు ఈ పోరాటం సరిపోదు. గట్టెక్కే అవకాశాల కోసం నాలుగో రోజంతా కూడా బ్యాటింగ్‌ చేయాల్సిందే.

మూడో రోజు ఇంగ్లాండ్‌ను ఆలౌట్‌ చేయడానికి భారత్‌కు ఎంతో సమయం పట్టలేదు. మరో 9 పరుగులకు మిగిలిన రెండు వికెట్లు పడగొట్టింది. పని పూర్తి చేశారు షమీ, బుమ్రా. అయినప్పటికీ సమర్పించుకున్న ఆధిక్యం అంతా ఇంతా కాదు. ఏకంగా 354 పరుగులు. ఇంగ్లాండ్‌ కూడా రెట్టించిన ఉత్సాహంతో కోహ్లీసేనను దెబ్బతీసేందుకు బౌలింగ్‌ దాడిని ఆరంభించింది.

ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ ఇన్నింగ్స్‌ను మొదలెట్టారు. రాహుల్‌ ఓసారి ఎల్బీ ఔట్‌ నుంచి తప్పించుకున్నాడు. రోహిత్‌ కూడా ఇంగ్లాండ్‌ పేసర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. నిలకడగా ఆఫ్‌స్టంప్‌ బంతులేస్తుండడంతో పరుగులు అంత తేలిగ్గా రాలేదు. వికెట్‌ కోల్పోకుండా టీమిండియా సెషన్‌ను ముగించేలా కనిపించింది. లంచ్‌కు ముందు ఆఖరి బంతికి రాహుల్‌ వెనుదిరిగాడు. ఓవర్టన్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టో కళ్లు చెదిరేలా అందుకున్న క్యాచ్‌తో రాహుల్‌ నిష్క్రమణ తప్పలేదు.

రోహిత్‌కు తోడైన పుజారా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ సహజ స్వభావానికి విరుద్ధంగా ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. అండర్సన్‌ బంతిని మిడ్‌వికెట్‌ బౌండరీకి తరలించి ఖాతా తెరిచి.. తర్వాత ఓవర్టన్‌ బౌలింగ్‌లోనూ ఫోర్‌ కొట్టాడు. వెంటనే అండర్సన్‌ ఓవర్లో మరో బౌండరీ సాధించాడు. తొలి 13 బంతుల్లో పుజారా 14 పరుగులు చేయడం విశేషం. ఆ తర్వాత కూడా చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించాడు.

రోహిత్‌ కూడా అంతే ఫోకస్‌డ్‌గా ఆడాడు. కరన్‌ బౌలింగ్‌లో వరుసగా 2 బౌండరీలు, సింగిల్‌తో హాఫ్ సెంచరీ (125 బంతుల్లో) పూర్తి చేశాడు. ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా భారత్‌ రెండో సెషన్‌ను ముగించింది. టీ వేళకు స్కోరు 112/1. టీ తర్వాత కాసేపటికే భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 116 వద్ద రాబిన్సన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 82 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

కోహ్లి రూపంలో పుజారాకు మరో చక్కని పార్టనర్ దొరికాడు. 91 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పుజారా.. బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అండర్సన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కోహ్లి కూడా ఎలాంటి తడబాటు లేకుండా, అలవోకగా బ్యాటింగ్‌ చేశాడు. పేసర్లతో ఫలితం లేకపోవడంతో మొయిన్‌ అలీని ప్రయోగించిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ రూట్‌.. ఆఖర్లో తనూ బంతిని అందుకున్నాడు. పుజారా, కోహ్లి.. అభేద్యమైన రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించారు.