ఫైనల్ టెస్టు : ఇంగ్లాండ్ 205 ఆలౌట్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

ఫైనల్ టెస్టు : ఇంగ్లాండ్ 205 ఆలౌట్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

India vs England Final 4th Test : భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని మొతేరా వేదికగా జరుగుతున్న ఆఖరి నాలుగో టెస్టులో 205 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. తొలి ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 205 పరుగులకు చాప చుట్టేసింది. భారత బౌలర్ అశ్విన్‌ వేసిన 75.5 బంతికి జాక్‌ లీచ్‌ (17 బంతుల్లో 1×4) 7 పరుగులతో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక అండర్సన్‌ (10) నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ 55 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లారెన్స్ 46 పరుగులు చేయగా, పోప్ 29, జానీ బెయిర్ స్టో 28 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (4-68) వికెట్లు తీయగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్ ఇద్దరు కలిపి (2+3) 5 వికెట్లు తీసుకున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో టీమ్‌ఇండియా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరాలని ఆశిస్తోంది.

మరోవైపు ఇంగ్లాండ్‌ గెలిచి సిరీస్‌ డ్రా చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఆఖరి టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌ను గెలిచినా లేక డ్రా చేసుకున్నా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో అడుగుపెడుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిస్తే ఆ జట్టు చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. ఈ సిరీస్ ఫైనల్లో గెలిచిన జట్టు జూన్ జరుగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది.


మరోవైపు టీమిండియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఓపెనర్లుగా శుభ్ మాన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగగా.. గిల్ (0) ఆదిలోనే చేతులేత్తేశాడు. గిల్ స్థానంలో చతేశ్వర పూజారా క్రీజులోకి వచ్చాడు. రోహిత్ శర్మ (4), పూజారా (0) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. 4.1 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 1 వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది.