గెలిస్తేనే నిలుస్తారు : న్యూజిలాండ్ తో 2వ వన్డేలో భారత్ ఫీల్డింగ్
ఆక్లాండ్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో 347 పరుగుల భారీ స్కోరు చేసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది టీమిండియా.

ఆక్లాండ్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో 347 పరుగుల భారీ స్కోరు చేసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది టీమిండియా.
ఆక్లాండ్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య శనివారం(ఫిబ్రవరి 08,2020) రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో 347 పరుగుల భారీ స్కోరు చేసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది టీమిండియా. సిరీస్ కాపాడుకునేందుకు కచ్చితంగా నెగ్గాల్సిన స్థితిలో భారత్ ఉండగా.. విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో కివీస్ మరో పోరుకు సిద్ధమైంది. కనీసం వన్డే సిరీస్ నైనా సొంతం చేసుకొని పరువు కాపాడుకోవాలని కివీస్ జట్టు పట్టుదలగా ఉంది. రెండో వన్డేలో టాస్ నెగ్గిన కోహ్లి సేన ఫీల్డింగ్ ఎంచుకుంది.
మూడు వన్డేల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. మొదటి వన్డేలో సాధించిన ఘన విజయం కివీస్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే ఊపును రెండో వన్డేలో కూడా కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. అందుకు అనుగుణంగా తమ ప్రణాళికలకు పదును పెట్టింది.
కాగా, ఇక్కడ ఇరు జట్లను ఒక రికార్డు మాత్రం ఊరిస్తోంది. తొలి వన్డేలో ఓటమి పాలైనా గత రెండు రెండు సిరీస్‌లను గెలుచుకున్న ఘనత టీమిండియాదైతే, ఇప్పటివరకూ ఇరు దేశాల వన్డే చరిత్రలో కివీస్ గడ్డపై భారత్ తొలి వన్డేలో పరాజయం చూసిన తర్వాత సిరీస్‌ను గెలుచుకున్న దాఖలాలు లేవు. దాంతో అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని న్యూజిలాండ్ కసితో ఉంది. గతంలో న్యూజిలాండ్‌లో భారత్ రెండు వన్డే సిరీస్‌లను మాత్రమే గెలిచింది. 2008-09లో 3-1 తేడాతో కివీస్‌పై గెలిచిన టీమిండియా.. 2019లో 4-1తో సిరీస్‌ను దక్కించుకుంది. అయితే ఈ రెండు సందర్భాల్లో భారత్ తొలి వన్డేలో గెలిచిన తర్వాతే న్యూజిలాండ్ గడ్డపై సిరీస్‌లను కైవసం చేసుకుంది.
2019 చివర్లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో సాధించింది. ఇక్కడ తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. భారత్ నిర్దేశించిన 288 పరుగుల టార్గెట్‌ను విండీస్ ఛేదించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత భారత్ వరుసగా రెండు వన్డేలను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2020 ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా టీమిండియా 2-1తోనే కైవసం చేసుకుంది.
తొలి వన్డేలో భారత్ నిర్దేశించిన 256 లక్ష్యాన్ని ఆసీస్ వికెట్ కోల్పోకుండా ఛేదించింది. కాగా, మిగతా రెండు వన్డేల్లో భారత్ విజయం సాధించడంతో సిరీస్ వశమైంది. మరి ఇప్పుడు కూడా టీమిండియా అదే రిపీట్ చేయాలంటే ముందుగా రెండో వన్డేలో విజయం సాధించాలి. మరి టీమిండియా రెండో వన్డేలో గెలుపును అందుకుని హ్యాట్రిక్ రేసులో నిలుస్తుందో.. లేక కివీస్‌కు సిరీస్‌ను సమర్పించుకుని తమ పాత రికార్డునే రిపీట్ చేస్తుందో చూడాలి.