నో డౌట్.. సిరీస్ మనదే: వైట్ వాష్ దిశగా భారత్

నో డౌట్.. సిరీస్ మనదే: వైట్ వాష్ దిశగా భారత్

భారత పర్యటనలో భాగంగా మూడు టీ20లు మూడు టెస్టులు ఆడేందుకు వచ్చిన సఫారీలకు పరాభవం తప్పేట్లు లేదు. వర్షం కారణంగా ఒక టీ20 రద్దు కాగా 1-1సమంగా సిరీస్ ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత టెస్టు ఫార్మాట్ లో భాగంగా ఆడిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ కు దాదాపు విజయం ఖాయమైంది. వైట్ వాష్ దిశగా దూసుకెళ్తోన్న భారత్ కు ఇంకా 2వికెట్ల దూరమే మిగిలి ఉంది. 

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ ను 497పరుగుల వద్ద డిక్లేర్ చేసి.. సఫారీలను ఘోరంగా కట్టడి చేశారు. ఫలితంగా దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ 162పరుగులకే ఆలౌట్ గా వెనుదిరిగారు. మరోసారి కోహ్లీ పాత వ్యూహాన్నే అమలు చేస్తూ ఫాలో ఆన్‌కు ఆడించగా మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి సఫారీలు 8వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే  చేయగలిగారు. స్టంప్స్ సమయానికి బ్రూనె (30), ఎన్రిచ్(5)క్రీజులో ఉన్నారు. ఇంకా ఎంగిడి మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంది. 

దీంతో లక్ష్యానికి 203పరుగుల దూరంలో ఉన్న సౌతాఫ్రికాకు వైట్ వాష్ తప్పదనేది ఖరారు అయిపోయింది. భారత ఆల్ రౌండ్ ప్రదర్శనకు ప్రొటీస్ జట్టు వణికిపోయింది. మూడో రోజు ఆట ఆడుతూ రెండో ఇన్నింగ్స్ లో 30పరుగులకు మించని వ్యక్తిగత స్కోరుతో బ్యాట్స్ మెన్ తడబడ్డారు. ఈ క్రమంలో షమీకి 3వికెట్లు దక్కగా, ఉమేశ్ యాదవ్ 2, జడేజా, అశ్విన్ చెరో ఒక వికెట్ తీయగలిగారు.