India Vs Sri Lanka Asia Cup 2022 : ఆసియా కప్.. భారత్ మరో ఓటమి.. ఫైనల్ ఆశలు గల్లంతు..!

ఆసియా కప్ టీ20 టోర్నీలో ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ చేతులెత్తేసింది. శ్రీలంకతో జరిగిన కీలక పోరులో భారత ఓటమిపాలైంది. భారత్ పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

India Vs Sri Lanka Asia Cup 2022 : ఆసియా కప్.. భారత్ మరో ఓటమి.. ఫైనల్ ఆశలు గల్లంతు..!

India Vs Sri Lanka Asia Cup 2022 : ఆసియా కప్ టీ20 టోర్నీలో ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ చేతులెత్తేసింది. సూపర్ 4లో వరుసగా రెండో ఓటమి చవిచూసింది. శ్రీలంకతో జరిగిన కీలక పోరులో పరాజయం పాలైంది. భారత్ పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

174 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంకను భారత బౌలర్లు ఏమాత్రం నిలువరించలేకపోయారు. లంక బ్యాటర్లు రెచ్చిపోయారు. స్వేచ్చగా బ్యాటింగ్ చేశారు. లంక ఓపెనర్లు నిస్సాంక (37 బంతుల్లో 52 పరుగులు), కుశాల్ మెండిస్(37 బంతుల్లో 57 పరుగులు) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. లంక గెలుపులో కీ రోల్ ప్లే చేశారు.

అయితే ఈ దశలో చాహల్ విజృంభించి 3 వికెట్లు తీయగా, అశ్విన్ ఓ వికెట్ తీయడంతో లంక కష్టాల్లో పడింది. కానీ కెప్టెన్ డాసున్ షనక, భానుక రాజపక్స జోడీ భారత్ కు మరో అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకు వచ్చినప్పటికీ విజయలక్ష్మి శ్రీలంకనే వరించింది. షనక 18 బంతుల్లో 33 పరుగులు, భానుక రాజపక్స 17 బంతుల్లో 25 పరుగులు చేశారు. వీరిద్దరూ ధాటిగా ఆడి జట్టుని గెలిపించారు. భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీశాడు. అశ్విన్ ఒక వికెట్ తీశాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులే చేసింది. భారత జట్టులో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో(72) చెలరేగాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో.. భారత్ భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా బ్యాట‌ర్లు ప‌రుగులు చేసేందుకు నానా క‌ష్టాలు ప‌డ్డారు.

రోహిత్ శ‌ర్మ (72), సూర్య కుమార్ యాద‌వ్ (34) మిన‌హా ఇత‌ర బ్యాట‌ర్లు రాణించలేదు. చివ‌ర‌లో వ‌చ్చిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ (15), హార్దిక్ పాండ్యా (17), రిష‌బ్ పంత్‌ (17) ఫర‌వాలేద‌నిపించ‌గా… మిగిలిన వారు అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయారు.

లంక 19.5 ఓవర్లలో 174/4 చేసి విజయం సాధించింది. చివరి ఓవర్‌లో లంకకు ఏడు పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్‌ అద్భుతంగానే బౌలింగ్ చేశాడు. అయితే ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేసి లంక విజయం సాధించింది.

సూపర్ 4లో భారత్ కు ఇది రెండో ఓటమి. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. ఈ ఓటమితో భారత్‌ ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. గురువారం అఫ్ఘానిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది.