కసి తీరింది : ఆసీస్ పై భారత్ సిరీస్ విజయం

లక్కీ గ్రౌండ్‌లో రోహిత్‌ శర్మ చెలరేగాడు. కోహ్లీ, శ్రేయస్‌ అదరగొట్టారు. బౌలర్లంతా సమిష్టిగా రాణించారు. దీంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్‌ అలవోకగా విజయం సాధించింది. 2-1

  • Published By: veegamteam ,Published On : January 20, 2020 / 01:47 AM IST
కసి తీరింది : ఆసీస్ పై భారత్ సిరీస్ విజయం

లక్కీ గ్రౌండ్‌లో రోహిత్‌ శర్మ చెలరేగాడు. కోహ్లీ, శ్రేయస్‌ అదరగొట్టారు. బౌలర్లంతా సమిష్టిగా రాణించారు. దీంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్‌ అలవోకగా విజయం సాధించింది. 2-1

లక్కీ గ్రౌండ్‌లో రోహిత్‌ శర్మ చెలరేగాడు. కోహ్లీ, శ్రేయస్‌ అదరగొట్టారు. బౌలర్లంతా సమిష్టిగా రాణించారు. దీంతో ఆఖరి వన్డేలో ఆసీస్ పై భారత్‌ అలవోకగా విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆసీస్‌ను మట్టి కరిపించిన కోహ్లీ సేన రెట్టించిన ఉత్సాహంతో కివీస్‌ టూర్‌కు రెడీ అవుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. ఫామ్‌లో ఉన్న ధవన్ మ్యాచ్‌కు దూరమవడంతో ఆందోళన చెందిన అభిమానుల్ని… రోహిత్‌ శర్మ సెంచరీతో అలరించాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ 89 పరుగులతో భారత్ విజయానికి బాటలు వేశాడు. వీరిద్దరూ కలిసి 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో భారత్ విజయం మరింత సులువైంది. ఆసీస్ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
 

77
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలుత ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. స్టీవ్ స్మిత్ 131 పరుగుల భారీ స్కోర్ చేశాడు. దీంతో ఆసీస్ భీకరమైన స్కోర్ చేస్తుందని అంతా భావించారు. అయితే చివర్లో భారత బౌలర్లు పుంజుకొని ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. షమీ 4, జడేజా 2 వికెట్లతో సత్తా చాటగా.. సైనీ, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.
 

dhwan
ఆటకు ముందే తొలి దెబ్బ:
286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు… ఆట మొదలు కావడానికి ముందే తొలి దెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ధవన్ దూరమయ్యాడు. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన రాహుల్ 19 పరుగులకే వెనుదిరిగాడు. ఈ సమయంలో రోహిత్‌కు కోహ్లీ జత కలిశాడు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. రోహిత్ 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు. అతని ధాటికి భారత్ విజయ లక్ష్యం కరిగిపోతూ వచ్చింది. వీరిద్దరే మ్యాచ్ ముగించేస్తారని అనుకునే సమయంలో… ఆడం జంపా బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ అవుటయ్యాడు.
 
kohli

కోహ్లి సెంచరీ మిస్:
రోహిత్ అవుటైన తర్వాత జోరు పెంచిన కోహ్లీ తను కూడా సెంచరీ చేసేలా కనిపించాడు. ఆ తొందర్లోనే 89 పరుగుల దగ్గర హేజిల్‌ వుడ్ బంతిని ఆడబోయి బౌల్డయ్యాడు. దీంతో ఛేజింగ్‌లో కోహ్లీ శతకం చూద్దామని అనుకున్న అభిమానులు నిరాశ చెందారు. అదే సమయంలో తానున్నా అన్నట్లు శ్రేయస్ అయ్యర్ బ్యాటు ఝుళిపించాడు. బౌండరీలతో విరుచుకుపడిన శ్రేయస్… 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 35 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. కోహ్లీ అవుటయ్యే సమయానికి భారత విజయానికి కేవలం 16 పరుగులే అవసరం ఉన్నాయి. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే వరుస ఫోర్లతో మ్యాచ్ ముగించాడు.

sharma

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్, సిరీస్ కోహ్లి:
అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్‌ శర్మ.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సిరీస్‌లో అత్యధిక పరుగులతో రాణించిన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. కోహ్లి ఈ మ్యాచ్‌తో మరో ఘనత సాధించాడు. అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇక సెంచరీతో చెలరేగిన రోహిత్‌ శర్మ… 2018 నుంచి భారత్ తరఫున అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 9 వేల పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాట్స్‌మన్‌ గా రోహిత్‌ చరిత్ర లిఖించాడు. విరాట్ కోహ్లీ 194, డివిలియర్స్ 208 తర్వాత… 218 ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు.

Also Read : ఈ Tea తాగండి.. 100 ఏళ్లు బతకండి!