టీమిండియాకు కొత్త జెర్సీ, ఆస్ట్రేలియా సిరీస్ లో న్యూ లుక్

  • Published By: madhu ,Published On : November 13, 2020 / 11:23 AM IST
టీమిండియాకు కొత్త జెర్సీ, ఆస్ట్రేలియా సిరీస్ లో న్యూ లుక్

Indian cricket team are reportedly set to don a new jersey :  టీమిండియాకు కొత్త జెర్సీ వచ్చేసింది. ఆస్ట్రేలియా సిరిస్‌లో భారత క్రికెట్‌ జట్టు కొత్త లుక్‌లో కనిపించనుంది. ఈ సిరిస్‌ నుంచి భారత క్రికెట్‌ జట్టు వన్డే, టీ20 మ్యాచుల్లో కొత్త జెర్సీని ధరించనుంది. 90వ దశకంలో మాదిరిగా నేవీ బ్లూ రంగులో ఉండనుంది కొత్త జెర్సీ. ఇటీవల ధరించిన సాంప్రదాయ స్కై బ్లూ కలర్ మారనుంది. ముదురు నీలం రంగులో ఉన్న జెర్సీపై తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో స్ట్రిప్స్‌ ఉన్నాయి.



ఇంతకు ముందు నైకీ సంస్థ భారత క్రికెటర్లకు స్పాన్సర్‌గా ఉండేది. అయితే తాజాగా ఆ సంస్థ వైదొలగడంతో MPL స్పోర్ట్స్ ఆ స్థానంలోకి వచ్చి చేరింది. ఇప్పటికే MPL స్పోర్ట్స్ సంస్థ గత నెలలో BCCIతో ఒప్పందం చేసుకుంది. ఎంపీఎల్ భారత జట్టుకు కొత్త కిట్లను స్పాన్సర్ చేయడంతో పాటు ఆటగాళ్లకు కొత్త జెర్సీ, కొత్త కిట్లను సమకూర్చనుంది.



భారత పర్యటన కోసం టీ20 క్రికెట్‌ ఆస్ట్రేలియా సైతం ఆటగాళ్ల కోసం కొత్త జెర్సీలను ఆవిష్కరించింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, డిసెంబరు 4 నుంచి మూడు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.



అలాగే ఆస్ట్రేలియాతో తొలిసారిగా డే/నైట్‌ టెస్టులో తలపడనుంది. మ్యాచ్‌ డిసెంబర్‌ 17-21 వరకు అడిలైడ్‌లో జరుగనుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్‌లో 26-30, వచ్చే ఏడాది సిడ్నీలో జనవరి 7-11, బ్రిస్బేన్‌ జనవరి 15-19 మధ్య మ్యాచులు జరుగనున్నాయి.