ఒలింపిక్ ముంగిట నాడాకు చురకలు

ఒలింపిక్ ముంగిట నాడాకు చురకలు

జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) పనితీరును ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) ప్రశ్నించింది. భారత క్రీడాకారులకు చేసే డోపింగ్ పరీక్షల్లో నాణ్యమైన ప్రమాణాలు లేవంటూ వాడా ఆరోపించింది. ఫలితంగా నాడాను ఆర్నెల్ల పాటు సస్పెండ్ చేసింది. నాడాకు చెందిన ఎన్‌డీటీఎల్‌‌ ల్యాబ్‌లో ప్రమాణాలు సరిగా లేవని వాడా గుర్తించింది.  ఒలింపిక్స్‌‌కు ఏడాది కూడా లేని సమయంలో నాడాకు ఇది ఎదురుదెబ్బ. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఫర్‌ ల్యాబొరేటరీస్‌ (ఐఎస్‌ఎల్‌) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం.. నాడా పనిచేయాల్సి ఉంటుంది. 

ఈ మేరకు వాడా.. తమ గుర్తింపు ఉన్న ల్యాబ్‌లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. ఎన్‌డీటీఎల్‌పై సస్పెన్షన్‌ 20 ఆగస్టు, 2019 నుంచి అమలులోకి వస్తుంది. అన్ని రకాల పరీక్షలు నిలిపేయాల్సిందిగా కూడా ‘వాడా’ ఆదేశించింది. కేవలం శాంపిల్‌ను మాత్రమే తీసుకునే అవకాశం ‘నాడా’కు ఉంది. వాటిని పరీక్షించకుండా ఇతర గుర్తింపు పొందిన సంస్థకు పంపించాలి. తాజా చర్యపై కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిటేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్‌)లో 21 రోజుల్లోగా అప్పీల్‌ చేసుకునే అవకాశం ఎన్‌డీటీఎల్‌కు ఉంది. 

ఒలింపిక్‌‍‌కు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉండడంతో కనీసం 5వేల మందికి పైగా డోపింగ్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో టెస్టులన్నీ బయటనిర్వహిస్తే నాడా భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.  ‘నాడా’పై సస్పెన్షన్‌ విధించడం పట్ల కేంద్ర క్రీడా శాఖ విస్మయం వ్యక్తం చేసింది. దీని వెనక ‘వాడా’ వాణిజ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్‌ జులనియా అన్నారు. ‘వాడా’ నిర్ణయంపై సీఏఎస్‌లో అప్పీల్‌ చేస్తామని రాధేశ్యామ్‌ తెలిపారు.