మిగిలిందొక్కటే: కీలక మ్యాచ్‌కు భారత్.. లంక

మిగిలిందొక్కటే: కీలక మ్యాచ్‌కు భారత్.. లంక

మూడు టీ20ల సిరీస్ లో భాగంగా భారత్ మూడో టీ20కి చేరుకుంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో రెండో టీ20లో గెలిచింది. 1-0 ఆధిక్యంలో నిలిచిన కోహ్లిసేన ఆఖరిదైన మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ పై పట్టు సాధించాలని భావిస్తోంది. చివరి మ్యాచ్‌లో జట్టు కూర్పు విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయంపై ఆసక్తి మొదలైంది. కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో గెలిచిన జట్టునే కొనసాగిస్తాడా లేక రిజర్వ్‌ బెంచ్‌పై ఉన్న సంజు శాంసన్‌, మనీష్‌ పాండేలకు అవకాశం ఇస్తారా అనేది చూడాల్సిందే. 

షార్ట్ ఫార్మాట్ కాబట్టి తుది జట్టులో అవకాశం దొరికితే చాలు. సద్వినియోగం చేసేసుకుంటున్నారు భారత కుర్రాళ్లు.. రెండో టీ20లో శార్దూల్‌ ఠాకూర్‌, నవ్‌దీప్‌ సైని ప్రదర్శనే ఇందుకు ఉదాహరణ. సీనియర్‌ పేసర్లు లేకపోవడంతో జట్టులో స్థానం దక్కించుకున్న శార్దూల్‌, సైనీ.. రెండో టీ20లో ఇద్దరూ కలిసి ఐదు వికెట్లు పడగొట్టారు. డెత్‌ ఓవర్లలో ఠాకూర్‌.. పేస్‌, బౌన్స్‌తో సైని రాణించారు. పాండ్య స్థానంలో వచ్చిన శివమ్‌ దూబె కూడా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. 

ఓపెనర్‌ స్థానం కోసం కేఎల్‌ రాహుల్‌తో శిఖర్‌ ధావన్‌ పోటీపడుతున్నాడు. రెండో మ్యాచ్‌లో మోస్తరు ప్రదర్శన చేసిన ధావన్‌.. ఆఖరి మ్యాచ్‌లో ఆడటంపై ఆసక్తి మొదలైంది. లంక జట్టులో ఎక్కువమంది ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఉండడంతో కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌లను చివరి మ్యాచ్‌కూ కొనసాగించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే జడేజా, చాహల్‌ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. జస్ప్రీత్‌ బుమ్రా చివరి మ్యాచ్‌లో మునుపటిలా విజృంభిస్తాడని భారత్‌ ఆశిస్తోంది.

రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పొందిన తర్వాత లంక.. సిరీస్‌ను సమం చేయాలంటే సర్వశక్తులూ ఒడ్డాల్సిందే. శుభారంభాలు అందిస్తున్న లంక బ్యాట్స్‌మెన్‌ అదే జోరును చివరి వరకూ కొనసాగించలేకపోతున్నారు. బ్యాటింగ్‌లో రాణించి భారీ స్కోరు చేస్తే తప్ప.. భారత్‌పై లంక ఒత్తిడి తీసుకురాలేదు. రెండో మ్యాచ్‌లో ఆడిన ఆల్‌రౌండర్‌ ఉదాన గాయంతో తప్పుకోవడం ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ. రెండో టీ20లో ఆడలేకపోయిన ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ ఆఖరి పోరులో బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

పిచ్‌, వాతావరణం

* పుణె పిచ్‌ బంతికి, బ్యాట్‌కు సమానంగా అనుకూలిస్తుంది. వర్షం కురిసే అవకాశాలు లేవు. వాతావరణం చల్లగా, పొడిగా ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.
* చివరిగా పుణెలో శ్రీలంక ప్రత్యర్థిగా ఆడిన టీ20లో భారత్‌ 101 పరుగులకే కుప్పకూలింది. 
* ఐదు టీ20 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా నాలుగింట్లో నెగ్గితే.. లంక నాలుగింట్లో ఓడిపోయింది.