INDvAUS: ఉత్కంఠ పోరులో భార‌త్ ఘ‌న విజ‌యం

INDvAUS: ఉత్కంఠ పోరులో భార‌త్ ఘ‌న విజ‌యం

విద‌ర్భ వేదిక‌గా జ‌రిగిన ఆసీస్-భార‌త్ ల రెండో వ‌న్డేలో భార‌త్ 8 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు భార‌త బౌల‌ర్లు ధీటైన స‌మాధాన‌మిచ్చారు.   బుమ్రా 2వికెట్లు, కుల్దీప్ 3వికెట్లు, కేద‌ర్,  జ‌డేజా తలా ఒక్క వికెట్ ప‌డ‌గొట్టి ఆస్ట్రేలియాను క‌ట్ట‌డి చేశారు. చివ‌రి బంతి వ‌ర‌కూ ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన పోరులో ఆస్ట్రేలియా గ‌ట్టి పోటినిచ్చింది.

251 పరుగుల ల‌క్ష్య చేధ‌న‌లో భాగంగా బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇంకా 3 బంతులు మిగిలి ఉండ‌గానే చేతులెత్తేసింది. స్టోనిస్(52), పీట‌ర్ హ్యాండ్స్‌కాంబ్‌(48) టాప్ స్కోర‌ర్లుగా నిలిచారు. విద‌ర్భ వేదిక‌గా చేధ‌న‌కు దిగిన జ‌ట్లే విజ‌యం ద‌క్కించుకుంటాయ‌నే సెంటిమెంట్ ఈ సారి వ‌ర్కౌట్ కాలేదు. 

ముందుగా ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవ‌డంతో బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌ నాగ్‌పూర్‌లోని విదర్భ వేదికగా రెచ్చిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డ కోహ్లీ(116; 120 బంతుల్లో 10 ఫోర్లు) పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఈ మేర భారత్.. ఆసీస్‌కు 251పరుగుల టార్గెట్ నిర్దేశించింది. క్రమంగా వికెట్లు పడిపోతున్నా.. మూడో వికెట్‌గా బరిలోకి దిగిన కోహ్లీ తానే జట్టుకు అన్నట్లు నిలిచిపోయాడు.
 

టీమిండియా ఇన్నింగ్స్:
ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌తో పేలవంగా ఆరంభించిన టీమిండియా ఇంత స్కోరు చేయగలదని ఊహించి ఉండరు. జట్టుకు దన్నుగా నిలుస్తాడని భావించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినా కోహ్లీ ఆత్మస్థైర్యం తగ్గలేదు. 

మూడు డకౌట్‌లు: 
వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ముగ్గురూ డకౌట్‌గా వెనుదిరిగారు.

ఒకే ఒక్కడు: 
43.1 బంతికి ముందు 99 పరుగుల వద్ద నిలిచిన కోహ్లీ.. కౌల్టర్ నైల్ వేసిన బంతిని బ్యాక్ వార్డ్ దిశగా బాది ఫోర్ బౌండరీ సాధించాడు. దీంతో సెంచరీకి మించిన స్కోరు సాధించిన కోహ్లీ 116 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇదే మ్యాచ్‌తో 159 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ కెప్టెన్‌గా 9వేల పరుగుల మైలురాయిని అందుకొని రికార్డును కొట్టేశాడు. గతేడాది ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లలోనే కోహ్లీ బ్యాట్స్‌మన్‌గా 10వేల పరుగుల మైలురాయిని దాటేశాడు. 

ఆసీసీ బౌలర్లు: 
మ్యాచ్‌కు ముందు స్పిన్ అనుకూలిస్తుందని బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ఎలాగైతే భారత్‌ను ఆల్ అవుట్ చేయగలిగింది. 48.2 ఓవర్లకు 250 పరుగుల వద్ద టీమిండియాను చుట్టేసింది. పాట్ కమిన్స్ 4 వికెట్లు పడగొట్టగా, ఆడం జంపా 2, కౌల్టర్ నైల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 1, నాథన్ లయన్ 1 వికెట్ తీయగలిగారు.