హామిల్టన్ వేదికగా భారత్‌కు మరోసారి భారీ టార్గెట్ 213

హామిల్టన్ వేదికగా భారత్‌కు మరోసారి భారీ టార్గెట్ 213

టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ఆఖరి టీ20లో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత్‌కు 213 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచుతూ సిరీస్ టైటిల్‌ను సవాల్ చేశారు. ఓపెనర్లు కొలిన్‌ మన్రో(72), సీఫెర్ట్‌(43)రాణించడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు చేయగలిగింది. కుల్దీప్‌ యాదవ్‌ 2 వికెట్లు, ఖలీల్‌ అహ్మద్‌, భువనేశ్వర్‌ చెరో వికెట్‌ తీశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కివీస్‌ 3 వికెట్లు కోల్పోయి 212పరుగులు చేసింది.

 

ఎనిమిది ఓవర్ల వరకు వికెట్‌ కోల్పోకుండా ఆడిన కివీస్‌ ఓపెనర్లు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఎనిమిదో ఓవర్లో కుల్‌దీప్‌ యాదవ్‌ ఈ జంటను విడదీశాడు. 7.4ఓవర్లో కుల్‌దీప్‌ వేసిన బంతికి సీఫెర్ట్‌(43) స్టంప్‌ఔట్‌ అయ్యాడు. కివీస్ విధ్వంసక ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (43)ను మహేంద్రసింగ్ ధోనీ మెరుపు వేగంతో స్టంపౌట్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. ఆతర్వాత మరో ఐదు ఓవర్ల వరకు వికెట్‌ కోల్పోకుండా ఆడిన కివీస్‌ పరుగుల వరద పారించింది. అర్ధశతకం పూర్తి చేసుకుని శతకం వైపు పరుగులు పెడుతున్న మన్రోను కుల్‌దీప్‌ అడ్డుకున్నాడు. 13.2ఓవర్లో కుల్‌దీప్‌ వేసిన బంతిని ఆడిన మన్రో(72) భారీ షాట్‌ కొట్టి హార్దిక్‌ పాండ్యకు చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కివీస్‌ మరో వికెట్‌ కోల్పోయింది.

14.4ఓవర్లో ఖలీల్‌ వేసిన బంతిని ఆడిన విలియమ్సన్‌(27) కుల్‌దీప్‌ యాదవ్‌కు చిక్కాడు. అప్పటికి జట్టు స్కోరు 151. బ్యాటింగ్‌కు దిగి ఫోర్లు, సిక్స్‌లు కొడుతున్న గ్రాండ్‌హోమ్‌(30)ను భువి పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్‌ టేలర్‌(14) తోడుగా డేరిల్‌ మిచెల్‌(19) అజేయంగా నిలిచి జట్టు స్కోరును 200 దాటించారు. దీంతో  నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. 

గత వారం హామిల్టన్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 30.5 ఓవర్లలో పేలవంగా 92 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డు నమోదు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ముగిసిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఇదే వేదికగా 2 పరుగుల తేడాతో ఓడిపోయింది.