INDvsBAN: మయాంక్ డబుల్ సెంచరీ, భారీ స్కోరుతో భారత్

INDvsBAN: మయాంక్ డబుల్ సెంచరీ, భారీ స్కోరుతో భారత్

బంగ్లాదేశ్ పై భారత్ విరుచుకుపడింది. ఒక్కరోజులో 413పరుగులు చేసి అరుదైన ఘనత సాధించింది భారత్. ఓవర్ నైట్ స్కోరు 86/1తో బరిలోకి దిగిన టీమిండియా స్కోరును మయాంక్ పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే డబుల్ సెంచరీకి మించిన స్కోరుతో చెలరేగాడు. 

రెండో రోజు ఆటలో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. సమయోచితంగా ఆడుతూ అడపదడపా బౌండరీలతో భారీ స్కోరు చేశారు. ఈ క్రమంలోనే పూజారా, రహానె, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీకి మించిన వ్యక్తిగత స్కోరు నమోదు చేయగలిగారు. మొదటి రోజు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 150పరుగులు చేసి ఆలౌట్ అవగా టీమిండియా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 260 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 

రెండో రోజు ఆటలో కోహ్లీసేన ఆరంభంలోనే రెండు వికెట్లు పోగొట్టుకుంది. పూజారా(54) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అబు జాయేద్ బౌలింగ్ లో సైఫ్ హస్సన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్దిపాటి విరామం తర్వాత బరిలోకి దిగిన కోహ్లీ (ఎల్బీడబ్ల్యూ) డకౌట్ గా నిరాశపరిచాడు. 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అజింకా రహానె(86), వృద్ధిమాన్ సాహా(12), ఉమేశ్ యాదవ్(25) చక్కటి ఇన్నింగ్స్ కనబరిచారు. బంగ్లా బౌలర్లలో అబూ జాయేద్ 4వికెట్లు పడగొట్టగా, ఇబాదత్ హుస్సేన్, మెహిదీ హసన్ చెరో వికెట్ చేజిక్కించుకున్నారు. స్టంప్స్ సమయానికి క్రీజులో రవీంద్ర జడేజా(60), ఉమేశ్ యాదవ్(25)ఉన్నారు.