INDvsBAN: తొలి రోజు భారత్‌దే పైచేయి

INDvsBAN: తొలి రోజు భారత్‌దే పైచేయి

టెస్టు ఫార్మాట్ లోనూ టీమిండియాదే పైచేయి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ను టీ20ఫార్మాట్లో చిత్తుగా ఓడించిన భారత్.. టెస్టులోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. గురువారం ఇండోర్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ముందుగా టాస్ ఓడిన భారత్ బౌలింగ్ చేసింది. 

భారత ఫేసర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. షమీ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టగా 150పరుగులకే ఆల్ అవుట్ అయింది. ముష్ఫికర్ రహీమ్(43)పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. 

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పేలవ ప్రదర్శన కనబరచిన బంగ్లాదేశ్.. టీ20 ఓటమి నుంచి కోలుకున్నట్లు కనిపించడం లేదు. షమీ 3వికెట్లు, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తలో 2వికెట్లు తీయగలిగారు. ముష్ఫికర్ తో పాటు, మోమినుల్ హఖ్(37), లిటన్ దాస్(21)మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేశారు. 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆరంభంలో కాస్త తడబడి రోహిత్ శర్మ(6)తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పూజారా(43) సహకారంతో మయాంక్ అగర్వాల్(37) క్రమంగా పరుగులు రాబట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 86పరుగులు చేయగలిగింది. క్రీజులో పూజారా, మయాంక్‌లు ఉన్నారు.