కివీస్ గెలిచింది: నీకో సిరీస్.. నాకో సిరీస్

కివీస్ గెలిచింది: నీకో సిరీస్.. నాకో సిరీస్

ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 22పరుగుల వ్యత్యాసంతో విజయాన్ని చేజిక్కించుకుంది. టీ20సిరీస్ గెలుచుకున్న భారత్.. కివీస్‌కు వన్డే సిరీస్ ను అప్పజెప్పినట్లు అయింది. ఇప్పటికే రెండు వన్డేలను ఓడిన భారత్.. మూడో వన్డేను నామమాత్రంగా ఆడాల్సి ఉంది. పరువు కోసం కోహ్లీసేన.. క్లీన్ స్వీప్ కోసం కివీస్ లు మంగళవారం ఉదయం 7గంటల 30నిమిషాలకు ఓవల్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. 

శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగుల చేసింది. 274 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన భారత్.. 9బంతులు ఉండగానే ఆలౌట్ గా వెనుదిరిగింది. శ్రేయాస్ అయ్యర్(52), రవీంద్ర జడేజా(55) హాఫ్ సెంచరీకి మించిన స్కోరు చేసి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ పూర్తి చేశాడు. 

ఓపెనర్లు పృథ్వీ షా(24), మయాంక్ అగర్వాల్(3)ఆరంభంలోనే తడబడడంతో ఇన్నింగ్స్ పేలవంగా ముగిసింది. వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ(15)జట్టును నడిపించలేకపోయాడు. ఫుల్ ఫామ్‌లో దూసుకెళ్తున్న కేఎల్ రాహుల్(4) సైతం గ్రాండ్ హోమ్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. శార్దూల్ ఠాకూర్(18), నవీదీప్ సైనీ(45).. జడేజాతో కలిసి కాసేపటి వరకూ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అతని అవుట్ తర్వాత వచ్చిన చాహల్(10), బుమ్రా(0)చేయడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. 

న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ గప్తిల్(79), టేలర్ (73) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీయగా, శార్దుల్ ఠాకూర్ 2, జడేజా ఒక వికెట్ తీశారు. మొదటి వన్డేలో సాధించిన ఘన విజయం కివీస్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే ఊపును రెండో వన్డేలోనూ కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటివరకూ ఇరు దేశాల వన్డే చరిత్రలో కివీస్‌ గడ్డపై భారత్‌ తొలి వన్డేలో పరాజయం చూసిన తర్వాత సిరీస్‌ను గెలుచుకున్న దాఖలాలు లేవు.
 
గతంలో న్యూజిలాండ్‌లో భారత్‌ రెండు వన్డే సిరీస్‌లను మాత్రమే గెలిచింది. 2008-09లో 3-1 తేడాతో కివీస్‌పై గెలిచిన టీమిండియా.. 2019లో 4-1తో సిరీస్‌ను దక్కించుకుంది. అయితే ఈ రెండు సందర్భాల్లో భారత్‌ తొలి వన్డేలో గెలిచిన తర్వాతే న్యూజిలాండ్‌ గడ్డపై సిరీస్‌లను కైవసం చేసుకుంది. 
 
2019 చివర్లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 2-1తో సాధించింది. ఇక్కడ తొలి వన్డేలో భారత్‌ పరాజయం పాలైంది. భారత్‌ నిర్దేశించిన 288 పరుగుల టార్గెట్‌ను విండీస్‌ ఛేదించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత భారత్‌ వరుసగా రెండు వన్డేలను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2020 ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా టీమిండియా 2-1తోనే కైవసం చేసుకుంది.