IndVsSA 2nd T20I : రెండో టీ20లో పరుగుల వరద.. సౌతాఫ్రికా బౌలర్లను ఊచకోత కోసిన భారత బ్యాటర్లు

గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ దంచికొట్టింది. భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. టాపార్డర్ బ్యాట్స్ మెన్ వీరవిహారం చేశారు.

IndVsSA 2nd T20I : రెండో టీ20లో పరుగుల వరద.. సౌతాఫ్రికా బౌలర్లను ఊచకోత కోసిన భారత బ్యాటర్లు

IndVsSA 2nd T20I : గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ దంచికొట్టింది. భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. టాపార్డర్ బ్యాట్స్ మెన్ వీరవిహారం చేశారు. సౌతాఫ్రికా బౌలర్లను చీల్చి చెండాడారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ నుంచి దినేశ్ కార్తీక్ వరకు బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ ధాటికి దక్షిణాఫ్రికా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ తొలి వికెట్ కు 96 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. రాహుల్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 57 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 43 పరుగులు చేశారు.

ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. సఫారీ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం 22 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 61 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరో ఎండ్ లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ 28 బంతుల్లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. చివర్లో వచ్చిన దినేశ్ కార్తీక్ కూడా తగ్గేదేలే అన్నట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దినేశ్ కార్తీక్ 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 17 పరుగులతో అజేయంగా నిలిచాడు.

సౌతాఫ్రికా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రబాడా ఒక్క వికెట్ తీయకపోగా, 4 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. వేన్ పార్నెల్ (54 పరుగులు), ఎంగిడీ (49 పరుగులు), ఆన్రిచ్ నోర్జే (3 ఓవర్లలో 41 పరుగులు) అదే బాటలో నడిచారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కాస్త ఫర్వాలేదనిపించాడు. మహరాజ్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.