ఆ 4 ఓవర్లు కొంపముంచాయి : రాజస్థాన్‌పై పంజాబ్ అనూహ్య విజయం

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 01:07 AM IST
ఆ 4 ఓవర్లు కొంపముంచాయి : రాజస్థాన్‌పై పంజాబ్ అనూహ్య విజయం

ఐపీఎల్ 2019 సీజన్‌ 12లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ బోణీ కొట్టింది. జైపూర్ వేదికగా సోమవారం(మార్చి 25, 2019) రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి చేరువగా వెళ్లిన పంజాబ్ జట్టు ఆఖర్లో  అసాధారణంగా పోరాడి 14 పరుగుల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టులో క్రిస్‌గేల్ (79 పరుగులు: 47 బంతుల్లో 8×4, 4×6) మెరుపు హాఫ్ సెంచరీతో బాదడంతో 4 వికెట్ల నష్టానికి ఆ జట్టు 184  పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్‌ని 170 పరుగులకే పరిమితం చేసింది. రాజస్థాన్ 9 వికెట్లు కోల్పోయింది. ఛేదనలో జోస్ బట్లర్ (69 పరుగులు: 43 బంతుల్లో 10×4, 2×6) మెరుపులు  మెరిపించడంతో.. ఒకానొక దశలో 148/2తో రాజస్థాన్ రాయల్స్ అలవోకగా గెలిచేలా కనిపించింది. చివర్లో కేవలం 16 పరుగుల వ్యవధిలో రాజస్థాన్ ఏకంగా 7 వికెట్లు చేజార్చుకుని ఓడిపోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ జట్టులో బట్లర్‌ (43 బంతుల్లో 10ఫోర్లు, 2 సిక్సర్లతో 69), శాంసన్‌ (25 బంతుల్లో ఒక  సిక్సర్‌తో 30), అజింకా రహానె (20 బంతుల్లో 4 ఫోర్లతో 27), స్మిత్‌ (16 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌తో 20) చేయడంతో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రాజస్థాన్‌ చివరి 4 ఓవర్లలో 7 వికెట్లు  కోల్పోయింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 21 పరుగులు అవసరం కాగా 6 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్‌పై 14 పరుగుల తేడాతో పంజాబ్‌ విజయం సాధించింది.

2008లో ఆరంభమైన ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 11 సీజన్లు జరిగాయి. 17సార్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. రాజస్థాన్ 10 మ్యాచుల్లో గెలుపొందగా.. పంజాబ్ 7 మ్యాచుల్లో విజయాన్ని అందుకుంది. 2013 ఐపీఎల్ సీజన్‌ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో.. రాజస్థాన్ రాయల్స్‌పై రెండేళ్ల నిషేధం వేటు పడటంతో 2016, 2017 ఐపీఎల్ సీజన్లకి ఆ జట్టు దూరమైన సంగతి తెలిసిందే.