కోట్లు పెట్టి కొంటే ఏం లాభం.. ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్ ఆటగాళ్లు..

  • Published By: vamsi ,Published On : October 20, 2020 / 06:45 PM IST
కోట్లు పెట్టి కొంటే ఏం లాభం.. ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్ ఆటగాళ్లు..

ఎడారి హీట్‌‌లో.. అరేబియన్‌‌ నైట్స్‌‌లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని మైదానాల్లో.. సగం రోజులు సాగిపోయాయి ఐపీఎల్‌ పోటీలు.. అలుపు లేకుండా బాదేవోడు ఒకడు.. బుల్లెట్లలా బంతులు విసిరేవారు మరొకరు.. బ్యాట్‌‌కు, బాల్‌‌కు మధ్య బ్యాలెన్స్‌‌ ఉండేలా రూపొందించిన పిచ్‌‌లపై యువకులైతే మెరుస్తున్నారు.. ఒక పాడిక్కల్, ఒక తెవాటియా.. ఇలా యువ తేజాలు మెరుపుల్లా మెరుస్తున్నాయి.

అయితే ఐపీఎల్‌ అంటేనే లెక్కలు.. వీలైనన్ని పరుగులు, కుదిరినన్ని వికెట్లు.. ప్రాంచైజ్‌లకు ఆటగాళ్లకి చెల్లించే ప్రతీ పైసా లెక్కే కదా? యాజమాన్యాలు కూడా తాము చెల్లిస్తున్న సొమ్ముకు తగినంత ప్రతిఫలాన్ని సదరు ఆటగాడి నుంచి ఆశిస్తూ ఉంటాయి. కొందరిపై భారీ అంచనాలతో తీసుకుంటూ ఉంటాయి. వారి కోసం కోట్లు ఖర్చు పెడుతాయి. అయితే ఈ ఐపీఎల్ సీజన్‌లో మాత్రం ఇచ్చినంత పుచ్చుకుని కొందరు ఆటగాళ్లు ఇస్తున్న ప్రతిఫలం మాత్రం అంతంత మాత్రమే. ఐపీఎల్ 2020లో కోట్లు పెట్టి కొనుక్కొన్న కొందరు ఆటగాళ్ల పరిస్థితి చూస్తే..



Pat Cummins(కోల్‌కతా నైట్‌రైడర్స్):
ఐపీఎల్‌ చరిత్రలో రికార్డు రేటుకు అమ్ముడుపోయిన బౌలర్‌గా నిలిచిన వ్యక్తి పాట్ కమిన్స్‌.. ఆస్ట్రేలియా పేస్ స్పియర్‌హెడ్ పాట్ కమ్మిన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 15.5 కోట్లకు కొనుక్కొంది. టెస్టుల్లో నెంబర్‌ 1 బౌలర్‌గా ఉన్న కమిన్స్‌ ఓ మ్యాచ్‌లో 3 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. దీంతో ‘ కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా ఆడితే ఎలా’ అంటూ విమర్శలు వచ్చాయి. అయితే తర్వాత పోను పోనూ కాస్త మెరుగ్గా రాణించడం మొదలు పెట్టారు. అయితే ఇప్పటివరకు జరిగిన తొమ్మిది మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్‌ను కూడా ఒంటిచేత్తో మలుపు తిప్పలేదు. ఒక్క ఓవర్‌ కూడా మెయిడెన్‌గా వేయలేకపోయాడు. 8.42 ఎకానమీతో పరుగులు ఇచ్చి కోల్‌కత్తాకు పెద్దగా ఉపయోగపడలేదు. అయితే 161 స్ట్రైక్ రేటుతో ఇప్పటివరకు 126పరుగులు చేసి బ్యాటింగ్‌లో మాత్రం పర్వాలేదు అనిపించాడు.



Glenn Maxwell (KXIP):
ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా హిట్టర్ మ్యాక్స్‌వెల్‌ను ఇతర ప్రాంచైజ్‌లతో పోటీపడి రూ.10.75 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. గత సీజన్లలో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడిన మ్యాక్సీ ఆల్ రౌండర్‌గా ఆకట్టుకున్నాడు. 2013 రూ.5.3 కోట్లు పలికిన మ్యాక్సీ..ఈ సీజన్‌లో 10.75కోట్ల రేటుకు అమ్ముడు పోయాడు. అయితే ఒకప్పుడు విధ్వంసానికి చిరునామాగా నిలిచిన మ్యాక్స్‌వెల్‌ ఈ సీజన్‌లో తన మార్క్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. ప్రస్తుతం జట్టులోకి తీసుకోవడమే భారం అన్నట్లుగా తయారైంది పంజాబ్ పరిస్థితి. 8 మ్యాచ్‌లలో కలిపి అతను ఆడింది 61 బంతులే చేసింది 58పరుగులే.. లీగ్‌లో అతను ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేదు..



Sheldon Cottrell (KXIP):
వికెట్‌ పడితే బౌలర్లు ఒక్కొక్కరు ఒక్కోలా సంబరాలు చేసుకుంటారు. అందులో వెస్టిండీస్‌ యువ ఫాస్ట్‌బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ సంబరం కాస్త కొత్తగా ఉంటుంది. అయితే అది ఎక్కువ సార్లు చెయ్యడం అతిగా కూడా అనిపిస్తుంది. అతను వికెట్‌ పడగొట్టిన ప్రతిసారీ సైనికుడి తరహాలో కవాతు చేసి సెల్యూట్‌ కొడుతూ ఉంటాడు. అయితే అతను వృత్తి రీత్యా జవాన్‌. చాలా ఏళ్లుగా జమైకా సైన్యంలో పని చేయడంతో వికెట్‌ తీసిన ప్రతిసారీ కవాతు చేసి, సెల్యూట్‌ కొడుతూ ఉంటాడు.. ఈ విషయాన్ని పక్కనపెడితే.. భారీ అంచనాల మధ్య 8.5కోట్లు పెట్టి కొనుక్కుంటే పంజాబ్‌కు పెద్దగా ఒరిగిందేం లేదు.. తెవాటియా చేత ఓ మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టించుకోవడం అందుకు అధనం.. 6 మ్యాచ్‌లలో 6 వికెట్లే తీయగా… 8.80 ఎకానమీతో ఈ సీజన్‌లో విఫలం అయ్యాడు.



Robin Uthappa (RR):
IPL కెరీర్‌లో 180కి పైగా మ్యాచ్‌లు ఆడిన అనుభవం రాబిన్ ఊతప్పది. 13 సీజన్లుగా మిస్ కాకుండా కనిపిస్తున్న అతి తక్కువ మంది ప్లేయర్లలో రాబిన్ ఊతప్ప ఒకడు. ఐదు సీజన్లకు పైగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకు ఆడిన రాబిన్ ఊతప్ప.. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. వేలంలో రూ.3 కోట్లు పెట్టి కొనుక్కొన్న రాజస్థాన్ కోసం కనీసం మూడు మ్యాచ్‌లలో కూడా మెరుగ్గా రాణించలేదు. కోల్‌కతా జట్టులో కీలక ఆటగాడిగా.. రెండు టైటిల్స్‌ సాధించడంలో భాగమైన రాబిన్‌ ఉతప్ప 6 మ్యాచ్‌లలో కలిపి 84బంతుల్లో చేసింది 83 పరుగులే. బెంగళూరుతో మ్యాచ్‌లో మాత్రమే 22బంతుల్లో 41పరుగులు చేశాడు. తర్వాత చెన్నై మ్యాచ్‌లో కూడా నాలుగు పరుగులకే పెవిలియన్ వెళ్లిపోయాడు.



Jaydev Unadkat (రాజస్థాన్ రాయల్స్‌):
రాజస్థాన్ రాయల్స్ జట్టు భారీ రేటుకు కొనుక్కొని బరిస్తున్న మరో ఆటగాడు జయదేవ్ ఉనద్కట్‌. గతంలో ఐపీఎల్‌ వేలంలో రెండుసార్లు రికార్డు స్థాయి మొత్తాలకు అమ్ముడుపోయి అంతగా రాణించలేకపోయిన జయదేవ్ ఉనద్కట్‌‌‌ను ఈ సీజన్‌లో రూ. 3 కోట్లు పెట్టి కొనుక్కొంది రాజస్థాన్ రాయల్స్. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లలో కలిపి అతను తీసింది 4 వికెట్లే. చెప్పుకోదగ్గ స్పెల్‌ ఒక్కటి కూడా వేయని ఉనాద్కట్‌ 9.57 ఎకానమీతో పరుగులు ఇచ్చుకున్నాడు. అంతేనా.. బెంగళూరుతో మ్యాచ్‌లో అయితే కీలకమైన ఓవర్‌లో గెలుపు ముంగిట ఉన్న రాజస్థాన్‌ను ఒవర్‌లో 25పరుగులు ఇచ్చి మ్యాచ్ ఓడిపోయేందుకు కారణం అయ్యాడు.



Aaron Finch (Royal Challengers Bangalore):
ఆరోన్ ఫించ్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో చేసింది 205పరుగులే. ఓపెనర్‌గా వస్తున్నా కూడా.. ఆస్ట్రేలియాలాంటి పెద్ద జట్టు కెప్టెన్‌ అయ్యుండి పెద్ద రాణించకపోవడం ఇబ్బందికర విషయం. 4.4కోట్లు పెట్టి కొన్నా కూడా.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన ఈ ఆటగాడి నుంచి ఒక్క విధ్వంసకర ఇన్నింగ్స్‌ రాకపోవడం కాస్త జట్టును నిరాశపరుస్తున్న అంశమే.



James Neesham (KXIP):
ఐపీఎల్‌2020 సీజన్‌లో పదే పదే ట్రోల్ అవుతున్న క్రికెటర్లలో కింగ్స్‌ పంజాబ్‌ ఆల్‌ రౌండర్‌, న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జేమ్స్ నీషమ్‌ ఒకడు. అతనిని 50లక్షలు పెట్టి కొన్నా కూడా పంజాబ్ జట్టుకు అతని వల్ల పెద్దగా ప్రయోజనం ఓనగూరలేదు.