పంజాబ్ జట్టుకు తగ్గిన టెన్షన్.. క్రిస్ గేల్‌కు కరోనా నెగెటివ్!

  • Published By: vamsi ,Published On : August 25, 2020 / 01:24 PM IST
పంజాబ్ జట్టుకు తగ్గిన టెన్షన్.. క్రిస్ గేల్‌కు కరోనా నెగెటివ్!

విద్వంసకర ఆటగాడు క్రిస్ గేల్‌కు కరోనా టెస్ట్‌లో నెగటివ్ వచ్చింది. ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కే ముందు, క్రిస్ గేల్ కరోనా పరీక్ష చేయించుకున్నాడు. దీనిలో అతనికి నెగెటివ్ అంటూ నివేదిక వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా క్రిస్ గేల్ ఈ విషయాన్ని వెల్లడించారు.



లెజండరీ రన్నర్ ఉసేన్ బోల్ట్ పుట్టినరోజు పార్టీకి గేల్ హాజరవగా.. ఉసేన్ బోల్ట్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అటువంటి పరిస్థితిలో, గేల్ గురించి కూడా సందేహం వ్యక్తం అయ్యింది. గేల్ కూడా బోల్ట్‌తో కలిసి ఉండడంతో కరోనా సోకిందనే అనుమానం వ్యక్తం అయ్యింది. కానీ కరోనా పరీక్షలో గేల్‌కు నెగెటివ్ వచ్చింది.

ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బ్యాట్స్‌మెన్‌గా గేల్ ఉన్నాడు. కెఎల్ రాహుల్ ఈసారి పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2019 ఐపీఎల్‌లో గేల్ 368 పరుగులు సాధించగా.. గేల్, రాహుల్ ఓపెనర్‌లుగా ఈసారి రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే పంజాబ్ జట్టుకు గేల్ విషయంలో కాస్త టెన్షన్ ఉండగా.. ఇప్పుడు అది తీరినట్లు అయ్యింది.



క్రిస్ గేల్ తన ఐపిఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 125 మ్యాచ్‌లు ఆడాడు. ఇదే సమయంలో 4,484 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో గేల్ 6 సెంచరీలు కూడా చేశాడు. గేల్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలెు చేసిన బ్యాట్స్ మాన్. అలాగే 28 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.

ఐపీఎల్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రికార్డు కూడా గేల్‌కు ఉంది. ఐపీఎల్‌లో గేల్ అజేయంగా 175 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తరఫున ఆడుతున్నప్పుడు అతను ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు. పూణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ అజేయంగా 175 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి. గేల్ ఈ తుఫాను ఇన్నింగ్స్‌ను కేవలం 66 బంతుల్లో పూర్తి చేశాడు.