437 రోజుల తర్వాత.. ధోని పేరిట ప్రత్యేక సెంచరీ రికార్డు..

  • Published By: vamsi ,Published On : September 20, 2020 / 11:25 AM IST
437 రోజుల తర్వాత.. ధోని పేరిట ప్రత్యేక సెంచరీ రికార్డు..

ఐపీఎల్ 2020లో ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఫేవరేట్‌గా ఐపిఎల్ 2020లోకి దిగిన ముంబైని తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌తోనే మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోని 437 రోజుల తర్వాత క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చాడు.

ఇంత కాలం తరువాత, ధోని మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే, అతను మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ధోని కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ధోని ఫస్ట్ ఇంటర్నేషేనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు భారీ జుట్టుతో చాలా స్టైలీష్‌గా ఉండేవాడు. ఇప్పుడు మరోసారి గడ్డం-మీసాలతో ట్రెండ్ సెట్టర్‌గా మారిపోయాడు.

ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ఎంఎస్ ధోని 100 క్యాచ్‌లు పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని వికెట్ వెనుక రెండు క్యాచ్‌లు తీసుకున్నాడు. దీంతో ధోని ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు పూర్తి చేశాడు, అందులో 95 క్యాచ్‌లు వికెట్ కీపర్‌గా పట్టుకున్నాడు. చెన్నై విజయంతో, ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా 100వ విజయాన్ని సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో జట్టుకు కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లు గెలిచిన తొలి ఆటగాడిగా ధోని నిలిచాడు. అయితే, ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్ ధోనినే.

ప్రపంచకప్‌లో చివరిసారిగా పోరాటం తర్వాత ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ధోనీ రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్యాకాలంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోని.. 39ఏళ్ల వయస్సులో ఫిట్‌నెస్ పరంగా యువ క్రికెటర్‌లకు పోటీ ఇస్తున్నాడు. ధోని తన కొత్త లుక్‌లో చాలా ఫిట్‌గా కనిపించాడు. ధోనికి బ్యాటింగ్‌లో పరుగులు చేసే అవకాశం లభించకపోయినా, వికెట్ వెనుక తన టాప్ ఫామ్‌ను చూపించాడు. ధోని మొత్తం రెండు క్యాచ్‌లు తీసుకోగా.. అందులో ఒక క్యాచ్ అద్భుతంగా ఉంది.