కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కొత్త కెప్టెన్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కొత్త కెప్టెన్

యావత్ క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూసే భారత దేశీవాలీ క్రికెట్ లీగ్ ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్). ప్రతి సీజన్‌కు మార్పులు చేర్పులు చేసుకుంటూ కొత్తదనంతో అడుగుపెట్టే ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానుల్లో క్రేజ్. ఐపీఎల్‌లో ఆడే 8ఫ్రాంచైజీలలో ఒకటైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింతా ఆధ్వర్యంలో మార్పులు ప్రతి సీజన్లో కనిపిస్తున్నాయి. గత సీజన్లో మెంటార్ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ లేకుండా బరిలోకి దిగింది. రాబోయే సీజన్లో మరో మార్పు చేస్తూ.. కెప్టెన్‌ని మార్చే ఆలోచనలో ఉందట.

వెస్టిండీస్‌తో ఆడుతోన్న టీమిండియాలో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకరు. చాలా రోజుల విశ్రాంతి అనంతరం జట్టులో ఆడుతున్న అశ్విన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఫలితంగా ఈ స్పిన్నర్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్సీ నుంచి తప్పించాలనుకుంటుందట. ఐపీఎల్ 2020కి కొత్త కెప్టెన్ రావొచ్చనే సమాచారం. ఐపీఎల్ 2018వేలంలో పంజాబ్ జట్టు అశ్విన్‌ను రూ.7.8కోట్లకు కొనుగోలు చేసింది. 

రెండు సీజన్లుగా అతని ప్రదర్శనలో అంతగా రాణించకపోవడం, గత సీజన్లో మాన్కడింగ్ వివాదం అశ్విన్ కెప్టెన్సీ కెరీర్‌పై ప్రభావం చూపించింది. అశ్విన్ బదులు ఆ స్థానాన్ని కేఎల్ రాహులే భర్తీ చేయాల్సి ఉంటుంది. పంజాబ్‌కు ఆడిన అశ్విన్ 25మ్యాచ్ ల్లో 25వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఐపీఎల్ కెరీర్లో 139మ్యాచ్ ల్లో 125వికెట్లు పడగొట్టాడు.