IPL 2021: ఆరంభమేనా.. ఈ సారైనా ఆశలు చిగురించేనా

ఐపీఎల్ ఆరంభ సీజన్ మాత్రమే గొప్పగా ప్రారంభించిన రాజస్థాన్.. మరోసారి ఆ రేంజ్ పర్‌ఫార్మెన్స్ చూపించలేక..

IPL 2021: ఆరంభమేనా.. ఈ సారైనా ఆశలు చిగురించేనా

Ipl 2021

IPL 2021: ఐపీఎల్ ఆరంభ సీజన్ మాత్రమే గొప్పగా ప్రారంభించిన రాజస్థాన్.. మరోసారి ఆ రేంజ్ పర్‌ఫార్మెన్స్ చూపించలేకపోతుంది. కొన్ని సీజన్లు ప్లే ఆఫ్ వరకైనా చేరుకోలేకపోతుంది. ఎంతో శ్రమించి 2013, 2015, 2018లో మాత్రమే ప్లేఆఫ్‌ వరకూ వెళ్లగలిగింది. ఇక గత సీజన్‌లో అయితే జట్టు చరిత్రలోనే పేలవంగా తొలిసారి ఆఖరి స్థానంలో నిలిచింది.

జట్టు బాగానే ఉన్నప్పటికీ.. సమష్టి ప్రదర్శన అనేది కొరవడినట్లుగా కనిపిస్తుంది. గత సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఉన్న స్మిత్‌ను వదులుకున్న రాజస్థాన్‌.. యువ ఆటగాడు సంజు శాంసన్‌కు ఆ బాధ్యతలు కట్టబెట్టింది. 2019లో కెప్టెన్ గా వ్యవహరించిన రహానెకు మరోఅవకాశం ఇవ్వడానికి ఆసక్తి చూపించనట్లు కనిపిస్తుంది.

ఈ ఏడాది వేలంలో దూకుడుగా వ్యవహరించిన ఆ జట్టు లీగ్‌ చరిత్రలోనే అత్యధిక ధర.. రూ.16.25 కోట్లతో ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ను కొనుగోలు చేసింది. జట్టుకు సమతూకం తెస్తాడని నమ్ముతోంది.

రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆ జట్టు బ్యాటింగే ప్రధాన బలం. స్మిత్‌ వెళ్లిపోయినప్పటికీ విధ్వంసం సృష్టించగల ఆటగాళ్లు ఉన్నారు. ప్రమాదకర బట్లర్‌, టాప్ రేంజ్ బ్యాట్స్‌మన్ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేయగలరనే ధీమాతో ఉంది. తమ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలింగ్‌ను చిత్తుచేయగలరు.

ఇక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన శాంసన్‌.. తనదైన రోజున చేసే విధ్వంసం గురించి అందరికీ తెలిసిందే. గత సీజన్‌లో రేంజ్‌ హిట్టింగ్‌తో అలవోకగా సిక్సర్లు బాదిన అతను.. ఈ సారి కూడా అదే జోరు చూపించాలనే ధ్యేయంతో బ్యాటింగ్‌లో నిలకడ ప్రదర్శిస్తే రాజస్థాన్‌కు తిరుగుండదు. మిడిలార్డర్‌లో రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా లాంటి కుర్రాళ్ల మెరుపు విన్యాసాలతో జట్టుకు అవసరమైన సమయాల్లో భారీ షాట్లతో ఆదుకున్నారు.

హిట్టింగ్‌ కెపాసిటీ ఉన్న పేస్‌ ఆల్‌రౌండర్‌ దూబె కూడా ఈ సారి జట్టులోకి వచ్చాడు. అంతర్జాతీయ అనుభవం మెండుగా ఉన్న మోరిస్‌ సైతం మ్యాచ్‌ను ముగించే సత్తా ఉన్నవాడే.

నిలకడలేని బౌలింగ్‌.. ఆ జట్టును కొన్నేళ్ల నుంచి వెంటాడుతున్న సమస్య. బ్యాటింగ్‌లో భారీ టార్గెట్ ఇచ్చినా ప్రత్యర్థులను కట్టడి చేయడంలో విఫలం అవుతుంది. జట్టుకు బలహీనతగా మారింది బౌలింగ్. గత సీజన్‌లోనూ ఆర్చర్‌ ఒక్కడే ప్రభావం చూపగలిగాడు. కానీ గాయానికి సర్జరీ కారణంగా ఈ సీజన్‌ మొత్తానికే దూరం కానుండటంతో భారమంతా మోరిస్‌పైనే పడనుంది.

మరోవైపు ఈ ఏడాది వేలంలో రూ.కోటి పెట్టి కొనుక్కున్న ముస్తాఫిజుర్‌ మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఉనద్కత్‌ నిలకడలేమి ఆందోళన కలిగించేదే. స్పిన్నర్లు తెవాతియా, శ్రేయస్‌ గోపాల్‌లపై ఆ జట్టు భారీ ఆశలతో ఉంది.

దేశీయ ఆటగాళ్లు: శాంసన్‌ (కెప్టెన్‌), యశస్వీ జైశ్వాల్‌, అనుజ్‌ రావత్‌, ఆకాశ్‌ సింగ్‌, కార్తీక్‌ త్యాగి, శ్రేయస్‌ గోపాల్‌, రాహుల్‌ తెవాతియా, జైదేవ్‌ ఉనద్కత్‌, చేతన్‌ సకారియా, మయాంక్‌ మార్కండె, శివమ్‌ దూబె, కరియప్ప, మహిపాల్‌ లామ్రోర్‌, మనన్‌ వోహ్రా, రియాన్‌ పరాగ్‌, కుల్‌దీప్‌
విదేశీ ఆటగాళ్లు: బట్లర్‌, లివింగ్‌స్టన్‌, మిల్లర్‌, ముస్తాఫిజుర్‌,టై, మోరిస్‌, స్టోక్స్‌
కీలక ఆటగాళ్లు: శాంసన్‌, బట్లర్‌, స్టోక్స్‌, మోరిస్‌